Begin typing your search above and press return to search.

ఇప్పుడు మీరు చదివేదంతా హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది

By:  Tupaki Desk   |   18 April 2022 4:04 AM GMT
ఇప్పుడు మీరు చదివేదంతా హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది
X
సమయం.. ఆదివారం తెల్లవారుజామున

ప్లేస్.. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10

సీన్ 1.. భారీ ఎత్తున వాహనాలు.. టిప్పర్లు.. బుల్ డోజర్లు.. దాదాపు డెబ్బై.. ఎనభై మంది.. అందరి చేతుల్లో మారణాయుధాలు. మొత్తం పది వాహనాల్లో వచ్చిన తర్వాత.. అక్కడి ప్రాంతంలో కాపలాగా ఉన్న వారిపై పెద్ద ఎత్తున దాడికి తెగబడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లుగా దాడి చేయటమే కాదు.. అక్కడున్న తాత్కాలిక కట్టడాల్ని కూల్చేశారు. కంటైనర్లను పెట్టేశారు. కేవలం గంటలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.

కట్ చేస్తే..

అవును.. మీరిప్పుడు చదివింది ఏ సీనిమాలోనో.. వెబ్ సిరీస్ లోనూ జరిగింది కాదు. సినిమా సీన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో.. ఆ మాటకు వస్తే.. అంతకు మించి అన్నట్లుగా సాగిన ఆరాచక కాండకు హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డుగా చెప్పుకునే బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. ఇంతటి ఆరాచకం ఎవరికి సాధ్యమన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. అదిప్పుడు పెద్ద చర్చకు తెర తీసింది. విభజన వేళలో తరచూ వినిపించే సీనియర్ రాజకీయ నేత.. ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీజీ వెంకటేశ్.. ఆయన సోదరుడు కుమారుడు అండ్ కో దీనికి బాధ్యులుగా భావిస్తున్నారు.

సినిమాల్లో మాదిరి వాహనాల్లో వచ్చి దాడికి తెగబడ్డ ఉదంతంలో మొత్తం తొంభై మంది పాల్గొంటే.. వారిలో 63 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఎంపీ టీజీ వెంకటేశ్ తో పాటు.. ఆయన సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్ మీదా కేసు నమోదైంది. అసలేం జరిగింది? ఈ మొత్తం ఉదంతానికి కారణం ఏమిటన్న వివరాల్లోకి వెళితే.. 2005లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఏపీ జెమ్స్ అండ్ జువెలర్స్ పార్కు కోసం బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబరు 10లో రెండున్నర ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం చూస్తే.. రూ.100 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.

ఈ స్థలంలో సంస్థ నిర్మాణాల్ని చేపట్టింది. దీనికి అనుకొని మరో అర ఎకరానికి పైనే స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలం తమదేనంటూ టీజీ వెంకటేశ్ సోదరుడి కుమారుడు కమ్ సినీ నిర్మాతగా పరిచయస్తుడు టీజీ విశ్వప్రసాద్ కొద్ది రోజుల క్రితం డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ఆదివారం తెల్లవారుజామున పది వాహనాల్లో మారణాయుధాల్నిచేపట్టిన భారీ సమూహం ఆదోని ప్రాంతం నుంచి బంజారాహిల్స్ కు చేరుకున్నారు.

స్థలానికి కాపలాగా ఉన్న వారిపై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసుల్ని చూసిన పలువురు వాహనాల్లో పరారైతే.. 63 మంది మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి చేతుల్లోని మారణాయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఏమైనా.. సినిమాల్లో మాదిరి.. ఒక భూమిని అక్రమించుకోవటానికి ఇంత భారీ క్రైం సీన్ చోటు చేసుకోవటం.. ఇటీవల కాలంలో జరగలేదన్న మాట వినిపిస్తోంది.

ఈ భూమి విషయంలో గతంలోనూ పలు వివాదాలు.. కేసులు ఉన్నాయని చెబుతున్నారు. ఏమైనా.. వాహనాల్లో భారీ ఎత్తున కిరాయి మూక వచ్చి దాడికి పాల్పడటం షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.