Begin typing your search above and press return to search.

ఉద్యోగం చేయాలన్న భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టేసిన భర్త

By:  Tupaki Desk   |   13 Oct 2020 4:57 PM IST
ఉద్యోగం చేయాలన్న భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టేసిన భర్త
X
విన్నంతనే విస్మయానికి గురి చేసే దారుణం ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. పని పాటా లేకుండా.. బాధ్యత మరిచి వ్యవహరిస్తున్న భర్తను పని చేయాలని కోరిన పాపానికి బలైపోయిన భార్య ఉదంతమిది. సంచలనంగా మారిన ఈ ఉదంతం గురించి విన్నంతనే అయ్యో అనిపించటమే కాదు.. ఇంత దారుణానికి ఒడికట్టిన వాడిని ఒక పట్టాన వదలకూడదన్న కోపం కలగటం ఖాయం. భర్త క్రూరత్వానికి బలైన ఈ భార్య వేదన కంట నీరు తెప్పించటం ఖాయం.

వెంకన్న.. సుభద్రలు భార్యభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు. పెద్దోడికి 18 ఏళ్లు.. చిన్నోడికి 16 ఏళ్లు. పన్నెండేళ్ల క్రితం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఉపాధి కోసం నగరానికి వీరి కుటుంబం వచ్చింది. భర్త పని చేయకపోవటం.. తానే చాకిరీ చేస్తూ కుటుంబాన్ని పోషించేది. అయినప్పటికీ వేధింపులు తప్పకపోవటంతో ఆరేళ్ల క్రితం దిల్ సుఖ్ నగర్ లోని తన తండ్రి వద్దకు పిల్లల్ని తీసుకొని వెళ్లిపోయింది సుభద్ర.

ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం తాను మారిపోయానని.. బాధ్యతగా ఉంటానని చెబుతూ..పెద్ద మనుషుల చేత రాయబారాన్ని చేయించాడు వెంకన్న. దీంతో.. తల్లిదండ్రుల మాటను కాదనలేక భర్త వద్దకు పిల్లల్నితీసుకొని వచ్చింది. వారంతా ఒక అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గా వచ్చారు. ఇంటికి వచ్చిన కొద్దిరోజులకే.. భర్తలో ఎలాంటి మార్పు లేని విషయాన్ని గుర్తించింది. పని లేకుండా తిరుగుతున్న అతడ్ని.. ఏదో ఒక పని చేయాలని కోరింది. అయినా అతడిలో మార్పు రాలేదు. తాజాగా వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది.

దీంతో.. భార్య మీద కోపం పెంచుకున్న వెంకన్న..ఆమె నిద్ర పోయిన తర్వాత అపార్ట్ మెంట్ సెల్లార్ లోని టూ వీలర్ నుంచి పెట్రోల్ తీసి.. ఆమె మీద చల్లాడు. వాసనకు మెలుకు వచ్చిన ఆమె.. గదిలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఆమెను రానివ్వకుండా గదిలోకి నెట్టేసి.. నిప్పు అంటించాడు. దీంతో.. ఆమె కేకలు వేసింది. పిల్లలు లేచి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్రంగాగాయపడిన ఆమెను ఉస్మానియాకు తరలించారు.చికిత్స పొందుతూ మరణించింది. భార్యను అమానుషంగా హత్య చేసిన వెంకన్న పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంకన్నను ఎల్ బీ నగర్ రింగు రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు.