Begin typing your search above and press return to search.

విషాదంః వంద‌ల మందికి అంతిమ సంస్కారం చేసి..

By:  Tupaki Desk   |   12 Jun 2021 9:30 AM GMT
విషాదంః  వంద‌ల మందికి అంతిమ సంస్కారం చేసి..
X
క‌రోనా మ‌హ‌మ్మారితో చ‌నిపోయిన వారి ద‌గ్గ‌ర‌కు కుటుంబ స‌భ్యులు సైతం రాలేదు. వేలాది మంది ప‌రిస్థితి ఇలాగే త‌యారైంది. కుటుంబ స‌భ్యులు అనాథ‌శ‌వాల్లా వ‌దిలేసి వెళ్తే.. మేమున్నామంటూ ముందుకు వ‌చ్చారు కొంద‌రు స్వ‌చ్ఛంద సేవ‌కులు. అలాంటి వారిలో ఒక‌రు రాజ‌మండ్రికి చెందిన మ‌ణికంఠ‌. కొంత మంది మిత్రులతో క‌లిసి.. కొన్ని వంద‌ల మృత‌దేహాల‌కు ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించారు. అలాంటి మ‌ణికంఠ‌.. అదే కొవిడ్ మ‌హమ్మారికి బ‌లైపోవ‌డాన్ని ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఏపీలోని రాజ‌మండ్రి రూర‌ల్ ధ‌వ‌ళేశ్వ‌రానికి చెందిన మ‌ణికంఠ‌, త‌న మిత్రుడు భ‌ర‌త్ రాఘ‌వ త‌దిత‌రులు క‌లిసి.. క‌రోనాతో మ‌ర‌ణించిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌డానికి పూనుకున్నారు. మ‌ణికంఠ‌కు సొంతంగా వ్యాన్ ఉంది. అందులో ఉద‌యం పూట పాలు డెలివ‌రీ చేస్తుంటాడు. ఆ త‌ర్వాత నుంచి ఆ వ్యాన్ ఖాళీగానే ఉంటోంది. దీంతో.. ఈ స‌మ‌యంలో స‌మాజానికి త‌న‌వంతు సేవ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు మ‌ణికంఠ‌.

కానీ.. ఇటీవ‌ల త‌న బృంద స‌భ్యుల‌తోపాటు మ‌ణికంఠ కూడా కొవిడ్ బారిన ప‌డ్డాడు. అత‌ని వ‌య‌సు 27 సంవ‌త్స‌రాలు. ఇంకా పెళ్లి కాలేదు. త‌ల్లిదండ్రులు విజ‌య‌న‌గ‌రంలోని సోద‌రుడి వ‌ద్ద ఉంటున్నారు. దీంతో.. మ‌ణికంఠ ఆల‌నాపాల‌నా చూసేవారు లేకుండా పోయారు. ఈ విష‌యం ఆల‌స్యంగా తెలుసుకున్న సోద‌రుడు వ‌చ్చి మ‌ణికంఠ‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ.. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ప్రాణాలు నిల‌వ‌లేదు.

దీంతో.. స్థానికంగా తీవ్ర విషాదం నెల‌కొంది. ఇత‌రుల‌కు స‌హాయం చేయ‌డానికి వెళ్లి.. మ‌ణికంఠ ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల అంద‌రూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా రోగుల‌ అంతిమ సంస్కారాల‌ను స‌జావుగా నిర్వ‌హించిన మ‌ణికంఠ‌.. చివ‌ర‌కు తాను కూడా ఆ మ‌హ‌మ్మారికి బ‌లికావ‌డం జీర్ణించుకోలేక‌పోతున్నారు.