Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పోలీసులకు షాకింగ్ అనుభవం.. ‘వణికిపోయారు’

By:  Tupaki Desk   |   7 Aug 2020 11:45 AM IST
హైదరాబాద్ పోలీసులకు షాకింగ్ అనుభవం.. ‘వణికిపోయారు’
X
అతడేమీ పెద్ద డాన్ కాదు. అంతకు మించి గ్యాంగస్టర్ కూడా కాదు. ఒక చిన్న వివాదంలో నిందితుడు. అతగాడ్ని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు కాసేపటికి అసలు విషయం తెలిసి వణికిపోయారు. రోజంతా విపరీతమైన టెన్షన్ లో గడిపిన వైనం బయటకు వచ్చింది. ఇంతకూ వారంతా వణికిపోవటానికి కారణం ఏమిటన్నది చూస్తే..

పాతబస్తీకి చెందిన చత్రినాకకు చెందిన ఒక వ్యక్తికి.. ఒక షట్టర్ యజమానికి మధ్య గొడవైంది. విషయం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. దీంతో పహాడీషరిఫ్ పోలీసులు షట్టర్ లో అద్దెకు ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారు. అలానే అని చెప్పిన వ్యక్తి.. తనకు అనారోగ్యంగా ఉండటంతో కరోనా టెస్టు చేయించుకొని స్టేషన్ కు వచ్చాడు.

అయితే.. ఈ విషయలేమీ తెలియని పోలీసులు సదరు వ్యక్తిని..స్టేషన్ కు వచ్చిన ఆ వ్యక్తిని రిమాండ్ కు తరలించే ప్రయత్నాలు షురూ చేశారు. సరిగ్గా నిందితుడ్ని రిమాండ్ కు పంపే సమయంలో.. అతని మొబైల్ కు కరోనా టెస్టు రిజల్ట్ రావటం.. అతడికి పాజిటివ్ అని తేలినట్లు మెసేజ్ రావటంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటివరకు తమకు దగ్గరగా ఉన్న వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలటంతో వారంతా తీవ్రమైన టెన్షన్ కు గురయ్యారు.

వెంటనే సదరు వ్యక్తిని రిమాండ్ కు కాకుండా ఆసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ మొత్తం డిస్ఇన్ఫెక్షన్ చేయించారు. అయినప్పటికీ పోలీసులకు.. అధికారులకు టెన్షన్ తగ్గలేదు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో రోజంతా స్టేషన్ బయటే ఉండిపోయారు. అయినప్పటికి చాలామందికి మాత్రం ఆందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది.ఈ ఉదంతం హైదరాబాద్ కమిషనరేట్ పోలీసుల్లో హాట్ టాపిక్ గా మారింది.