Begin typing your search above and press return to search.

పిల్లలు లేరని ఈ భార్యాభర్తలు ఏంచేశారో తెలిస్తే షాక్ అవుతారు..ఇంతకీ ఏంచేశారంటే !

By:  Tupaki Desk   |   4 Feb 2021 5:00 AM IST
పిల్లలు లేరని ఈ భార్యాభర్తలు ఏంచేశారో తెలిస్తే షాక్ అవుతారు..ఇంతకీ ఏంచేశారంటే !
X
ప్రతి మహిళకి అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది. అసలు ఆడజన్మకి అమ్మతనం తో నిండుతనం వస్తుంది. అయితే , ఆ అదృష్టం అందరికీ రాదు. దానికి కూడా ఆ దేవుడి సంకల్పం ఉండాలి. ఇక పెళ్లి తర్వాత పిల్లల కోసం కొంతమంది చేయని ప్రయత్నం అంటూ ఏమీ ఉండదు. పెళ్లై ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టడం లేదని కొందరు దంపతులు మదనపడుతుంటారు.

అలాంటి వారు పిల్లలు పుట్టాలని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. కొంతమంది పంచభూత క్షేత్రాల్లో పూజలు చేస్తుంటారు. మరికొంత మంది సంతానం కోసం నాగదేవతకు పూజలు చేస్తుంటారు. కానీ.. ఆలయాల్లో ఉన్న విగ్రహాలను దొంగిలించి మరీ పూజలు చేసిన వాళ్ల గురించి విన్నారా. సరిగ్గా.. అలాంటి ఘటనే లంగర్ ‌హౌజ్, కుల్సుంపురా పీఎస్‌ ల పరిధిలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే ... ఫిలింనగర్ ‌కు చెందిన సంతవరపు సిద్దేశ్, అతని భార్య సుజాత కు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. పిల్లలు లేరనే బెంగ వారిని వెంటాడుతోంది. నాగదేవత, కట్ట మైసమ్మ, లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాలను ఇంటికి తీసుకొచ్చి పూజలు చేస్తే.. ఇంట్లో ఉన్న పీడ తొలగిపోయి సంతాన ప్రాప్తి పొందొచ్చని సిద్దేశ్ స్నేహితుడు ఒకరు సలహా ఇచ్చాడు. ఆ సలహాను తూచాతప్పకుండా పాటించిన సిద్దేశ్, అతని భార్య సుజాత కుల్సుంపురా పీఎస్ పరిధిలోని నాగదేవత ఆలయంలో, లంగర్‌ హౌజ్ పీఎస్ పరిధిలోని లక్ష్మీ నరసింహ స్వామి మందిరంలో విగ్రహాలను చోరీ చేశారు.

విగ్రహాలు కనిపించడం లేదని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును సీరియస్‌గా తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు సిద్దేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని భార్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె కోసం గాలిస్తున్నారు. సిద్దేశ్ వద్ద నుంచి ఇత్తడితో తయారుచేసిన విగ్రహంతో పాటు మరికొన్ని లోహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.