Begin typing your search above and press return to search.

దుబ్బాకలో టీఆర్‌ ఎస్‌ కు 'దుబ్బాక' షాక్ తప్పదా?

By:  Tupaki Desk   |   8 Nov 2020 12:15 PM IST
దుబ్బాకలో టీఆర్‌ ఎస్‌ కు దుబ్బాక షాక్ తప్పదా?
X
తెలంగాణలో జరిగిన ఏకైక ఉప ఎన్నిక దుబ్బాక ఫలితాలు వెలువడడానికి సమయమైంది. ఈనెల 3న పోలింగ్‌ ప్రశాంతంగా జరగగా ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం దుబ్బాక నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు సైతం ఎవరు గెలుస్తారా..? అని ఆత్రుతగా చూస్తున్నారు. అయితే దుబ్బాకకు పోలింగ్‌ నిర్వహించిన తరువాత కొన్ని సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ను ప్రకటించాయి. వీటిలో ఒక సంస్థతో మరో సంస్థ సంబంధం లేకుండా ప్రకటించాయి. మొత్తంగా మాత్రం బీజేపీకి ఈ ఎన్నిక కలిసొచ్చిందని అర్థమైంది.

అధికార టీఆర్ఎస్ కు దుబ్బాకలో షాక్ తప్పదన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని మరో రెండు సర్వేలు తేల్చాయి. 'ఆరా' అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత విజయం సాధిస్తారు. 48.72 శాతం ఓట్లు దక్కుతాయి. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఉంటారు. 44.64 శాతం ఓట్లు పడుతాయని తెలిపింది. దుబ్బాక ఫలితం ఎలా ఉన్నా పోటాపోటీగా ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. మొదట సాధారణ ఎన్నికనే అనుకున్న టీఆర్‌ఎస్‌కు రానురాను బీజేపీ గట్టి పోటి ఇచ్చింది.

ప్రముఖ సర్వే సంస్థ మిషన్‌ చాణక్య నిర్వహించిన సర్వే ప్రకారం దుబ్బాకలో బీజేపి విజయం సాధిస్తుంది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు 51.82 శాతం ఓట్లతో గెలుపొందుతారు. రెండోస్థానంలో టీఆర్‌ఎస్‌ ఉంటుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు 35.67 శాతం ఓట్లు, మూడో స్థానంలో వచ్చే కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి 12.15 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.

అయితే టీఆర్‌ఎస్‌కు చెందిన హరీశ్‌రావు ఇక్కడ గెలుపు గురించి కాకుండా మెజారిటీ పైనే దృష్టి పెట్టామని ప్రచారం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చూస్తే ఏ సర్వేలో మెజారిటీ కనిపించడం లేదు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడంతో ఆ సంఘటన పెద్ద ఎత్తున ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిరసన వ్యక్తం చేయడం, అగ్ర నాయకులు వచ్చి ప్రచారం చేయడం బీజేపీకి ప్లస్‌ అయిందని చర్చించుకుంటున్నారు.

మరోవైపు సిద్ధిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాలను అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్‌ దుబ్బాకలో మళ్లీ గెలిచినా పట్టించుకోరనే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది. దీంతో కేసీఆర్‌ ముందు నుంచి వేసిన వ్యూహం బెడిసికొట్టే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఒకవేళ దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వస్తే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రభావం పడుతుందని అందరూ భావిస్తున్నారు.