Begin typing your search above and press return to search.

సాగరి బరిలో 400 అమరుల కుటుంబాలు: టీఆర్ఎస్ కు షాక్ యేనా?

By:  Tupaki Desk   |   25 March 2021 6:04 AM GMT
సాగరి బరిలో 400 అమరుల కుటుంబాలు: టీఆర్ఎస్ కు షాక్ యేనా?
X
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ కు మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పసుపు బోర్డు కోసం అక్కడి రైతులు నిజామాబాద్ ఎంపీ స్థానానికి భారీగా నామినేషన్లు వేసి సమస్యను దేశం దృష్టికి తీసుకొచ్చారు. పసుపు బోర్డు తేవడంతో నాటి ఎంపీ కవిత విఫలమయ్యారని అందుకే నామినేషన్లు వేసి ఓడించారు.

ఇప్పుడు అదే వ్యూహాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు నాగార్జున సాగర్ లో అనుసరించడానికి రెడీ అయ్యారు. ఈ పరిణామం టీఆర్ఎస్ కు షాక్ లా మారింది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో 400 మంది అమరవీరుల కుటుంబ సభ్యులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అమరవీరుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని.. కానీ స్వరాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోలేదని తెలంగాణ అమరవీరుల ఫోరం మండిపడింది. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకే సాగర్ లో నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం 1385 అమరవీరుల కుటుంబాలను గుర్తించారు. కానీ అందులో 500మందికి ఎలాంటి సాయం అందలేదు. మా కష్టాలు ప్రపంచానికి చెప్పేందుకే సాగర్ ఎన్నికల్లో పోటీచేస్తున్నాం.. 400 మంది అమరవీరుల కుటుంబ సభ్యులం నామినేషన్ వేయబోతున్నాం అని తెలంగాణ అమరవీరుల ఫోరం అధ్యక్షుడు రఘుమారెడ్డి సంచలన ప్రకటన చేశారు.

అమరుల కుటుంబాలకు సాయం చేయలేదని.. అందుకే సాగర్ లో బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. కాగా మార్చి 30 వరకు సాగర్ లో నామినేషన్లకు గడువు ఉంది. ఇప్పటివరకు 11 నామినేషన్లు దాఖలయ్యాయి.