Begin typing your search above and press return to search.

రోజాకు సొంత పార్టీ నాయ‌కులు ఇచ్చిన షాక్ ఇదే!

By:  Tupaki Desk   |   16 July 2022 3:12 AM GMT
రోజాకు సొంత పార్టీ నాయ‌కులు ఇచ్చిన షాక్ ఇదే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ మంత్రికి రోజాకు సొంత పార్టీ వైఎస్సార్సీపీ నేత‌లే షాకిచ్చారని వార్త‌లు వ‌స్తున్నాయి. అందులోనూ ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లా న‌గ‌రిలోనే ఆమెకు షాక్ త‌గిలింద‌ని అంటున్నారు. న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గంలో రోజాకు సొంత పార్టీలోనే తీవ్ర అస‌మ్మ‌తి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆమె గ‌త రెండు ఎన్నిక‌ల్లో గెలిచింది కూడా బొటాబొటీ మెజారిటీతోనే కావ‌డం గ‌మ‌నార్హం.

అతి త‌క్కువ మెజారిటీ సాధించ‌డానికి కూడా అస‌మ్మ‌తి కార‌ణ‌మ‌ని చెప్పుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ తాను మ‌ద్ద‌తిచ్చిన వ్య‌క్తిని ఎంపీపీగా చేసుకోవ‌డానికి రోజా చెమ‌టోడ్సాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్సీపీలో కీల‌కంగా ఉన్న రెడ్డివారి చ‌క్ర‌పాణిరెడ్డి, మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ కేజే కుమార్, ఆయ‌న భార్య‌ కేజే శాంతి, అమ్ములు త‌దిత‌రుల‌తో రోజాకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. అయినా స‌రే రెడ్డివారి చ‌క్ర‌పాణిరెడ్డి శ్రీశైలం దేవ‌స్థానం చైర్మ‌న్ గా, కేజే శాంతి ఈడిగ‌ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు.

కాగా ఈసారి న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి రోజాకు చుక్కెదురు అయ్యింద‌ని అంటున్నారు. తాము వైఎస్సార్సీపీలో ఎప్ప‌టి నుంచో ప‌నిచేస్తున్నామ‌ని.. అయితే.. త‌మ‌కు పార్టీని న‌మ్ముకున్నందుకు అప్పులు మిగిలాయ‌ని.. బాధితులు తీవ్ర ఆవేద‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఫ్లెక్సీలు ప్ర‌ద‌ర్శించి.. నిర‌స‌న తెలిపార‌ని అంటున్నారు. దీంతో మంత్రి రోజా వారికి స‌ర్దిచెప్పి అక్క‌డ నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని చెప్పుకుంటున్నారు.

పార్టీని న‌మ్ముకుని పనులు చేస్తే.. బిల్లులు రాక పోగా.. ఎదురు ఆ డ‌బ్బుల‌కు వ‌డ్డీలు క‌ట్టేందుకు అప్పుల పాలయ్యామని కార్య‌క‌ర్త‌లు రోజాను గ‌ట్టిగా నిల‌దీశార‌ని అంటున్నారు. 'గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమంలో భాగంగా.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం వ‌డ‌మాల‌పేట మండ‌లం బుట్టిరెడ్డి కండ్రిగకు రోజా వ‌చ్చారు.

ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్టామ‌ని.. అయితే ఇంత‌వ‌ర‌కు బిల్లులు రాలేద‌ని మాజీ సర్పంచ్, ఆయన భార్య రోజాను నిల‌దీశార‌ని తెలుస్తోంది. ప‌నులు చేసిన‌వారిని వ‌దిలేసి పనులు చేయనివారికి బిల్లులు ఇచ్చారంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశార‌ని చెబుతున్నారు.