Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు షాక్ టీఎస్ఆర్టీసీ ఏర్పాటే చట్టవిరుద్ధమట

By:  Tupaki Desk   |   7 Nov 2019 3:16 PM GMT
కేసీఆర్‌ కు షాక్  టీఎస్ఆర్టీసీ ఏర్పాటే చట్టవిరుద్ధమట
X
తెలంగాణ ఆర్టీసీ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. అసలు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అన్నదే లేదని.. ఏపీఎస్ ఆర్టీసీ విభజనకు ఇంకా చట్టబద్ధత లేదన్న వాదన మొదలైంది. అంతేకాదు, ఆర్టీసీలో తమకు 33 శాతం వాటా ఉందని కేంద్రం హైకోర్టు కు చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఇక ఏపీఎస్‌ ఆర్టీసీ లో కేంద్రానికి 33 శాతం వాటా ఉందని, అది టీఎస్‌ ఆర్టీసీకి ఆటోమెటిక్‌ గా బదిలీ కాబోదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టు కు ఆర్టీసీ సమ్మె పై విచారణ సందర్భంగా తెలియ జేసింది. కేంద్రం తరపున లాయర్‌ రాజేశ్వర్‌ రావు కోర్టులో వాదనలు వినిపిస్తూ.. ఏపీఎస్‌ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని, టీఎస్‌ ఆర్టీసీకి ఏ విధమైన చట్టబద్ధత లేదని అన్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీని విభజిస్తే తప్పని సరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలని, కేంద్రం అలాంటి అనుమతి ఇచ్చినట్లు ఆధారాల్లేవని ఆయన కోర్టుకు చెప్పారు.

కాగా కేంద్రం కొత్తగా తెర పైకి ఈ వాదన తేవడంతో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు అడిగింది. ఆర్టీసీ.. ఏపీఎస్‌ ఆర్టీసీగా.. టీఎస్‌ ఆర్టీసీగా విభజన జరిగిందా? లేక టీఎస్‌ ఆర్టీసీ కొత్తగా ఏర్పాటైందా? ఆర్టీసీ అంటే టీఎస్‌ ఆర్టీసీయేనా? లేక ఏపీఎస్‌ ఆర్టీసీనా? అని ప్రశ్నించింది. దీనికి తెలంగాణ సీఎస్‌ ఎస్కే జోషి బదులిచ్చారు. విభజన చట్టంలో షెడ్యూల్‌ 9 కిందకు ఆర్టీసీ వస్తుందన్నారు. అలాగే పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటైందని ఏజీతోపాటు ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ తెలిపారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌ లో ఉందని అడ్వకేట్‌ జనరల్‌ చెప్పారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఒకవైపు విభజన పెండింగ్‌ లో ఉందని చెబుతున్నారు...మరో వైపు కొత్త ఆర్టీసీ ని ఏర్పాటు చేశామంటున్నారు... ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలూ కేంద్రాన్ని అనుమతి కోరాలి కాదా అని నిలదీసింది ధర్మాసనం. కేంద్రం అనుమతి లేకుండా రెండు కొత్త సంస్థలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. ఆర్టీసీ విభజనకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఆధారాల్లేవని కోర్టు స్పష్టం చేసింది.

కాగా... ఏపీఎస్‌ ఆర్‌టీసీ ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేశామని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టు కు తెలిపారు. దీంతో కేంద్రం అనుమతి లేకుండా..అక్కడ ఈ అంశం పెండింగ్‌లో ఉండగా.. కొత్త స్వతంత్ర సంస్థను ఎలా ఏర్పాటు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ విభజన జరగకుండా ప్రభుత్వం ఎలా నోటిఫికేషన్‌ ఇస్తుందని నిలదీసింది. సెక్షన్‌ 47Aపై సుదీర్ఘ విచారణ జరుపుతోంది. ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా అని కూడా గట్టిగా ప్రశ్నించింది హైకోర్టు.

ఉద్దేశ పూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అధికారులను హెచ్చరించింది హైకోర్టు. ఆర్థిక శాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. IAS అధికారులు అసమగ్ర నివేదికలివ్వడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రికార్డులు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు కోర్టుకు చెప్పడం తో ఇంతకుముందు ఇచ్చిన నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా వివరణ ఇచ్చారు. సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని ఆయన వెల్లడించారు. మన్నించాలని హైకోర్టును వేడుకున్నారు. అయితే క్షమాపణ కోరడం సమాధానం కాదని.. వాస్తవాలు చెప్పాలని ఆదేశించింది హైకోర్టు. మంత్రిని ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించినట్లు ఆర్టీసీ ఎండీ నివేదికలో స్వయంగా అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. సీఎం, మంత్రులను కూడా తప్పుదోవ పట్టించేలా నివేదికలున్నాయని మండిపడింది. రవాణ శాఖ మంత్రిని, ప్రభుత్వాన్నీ తప్పుదోవ పట్టిస్తారా అని నిలదీసింది. సీఎంనే తప్పుదో పట్టించినవారు నిజాలు చెబుతున్నారాని ఎలా నమ్మాలంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

ప్రభుత్వం, కార్మిక సంఘాల వైఖరి వల్ల ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సమస్య తాత్కాలిక పరిష్కారం కోసం కనీసం 47 కోట్లు ఇవ్వాలని కోరితే ప్రభుత్వం నిరాకరించిందని గుర్తు చేసింది ధర్మాసనం. అసలు ఈ విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటని సీఎస్‌ను ప్రశ్నించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయ్యాలని .. ప్రజల కోసం ప్రభుత్వం మెట్టు దిగలేదా అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.

మొత్తానికి ఈ వ్యవహారాంలో కార్మికులు, కార్మిక సంఘాల మాటెలా ఉన్నా తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డంగా బుక్కయినట్లే కనిపిస్తోంది. రూట్లు ప్రయివేటు వాళ్లకు ఇవ్వడానికి తొందర పడడం.. కార్మికుల ఉద్వాసన వంటి విషయంలో ఆయన ఎంత పట్టుదలగా ఉన్నా ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.