Begin typing your search above and press return to search.

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్

By:  Tupaki Desk   |   18 Nov 2020 4:20 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్
X
ఎవ్వరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల నగారా మోగించి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లను గుక్కతిప్పుకోనివ్వకుండా చేశారు. బీజేపీ ఇప్పటికే ఇన్ చార్జిలను నియమించి సిద్ధమవ్వగా కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోనే లేదు. ఇప్పటికే దుబ్బాక సహా తెలంగాణలో వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ఎన్నికల్లోనూ సంపూర్ణ విజయాన్ని.. మెజార్టీని సాధించింది లేదు. కేసీఆర్ దెబ్బలకు కుదేలవుతూనే ఉంది. దుబ్బాకలో అయితే మూడోస్థానానికి పడిపోయి బావురుమంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను బీట్ చేసి బీజేపీ ముందుకు దూసుకు వస్తోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నిక కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థుల ఎంపిక తలనొప్పిలా మారిందనే చెప్పాలి. గతంలో జీహెచ్‌ఎంసీల అభ్యర్థుల్లో కొందరికి మళ్లీ టికెట్లు ఇచ్చినా.. ఇంకా మినిమం వంద మందికి పైగా అభ్యర్థులను అయితే సెలక్ట్‌ చేయాల్సి ఉంది. అంతేకాదు.. అసంతృప్తులను బుజ్జగించాల్సి ఉంటుంది. అంతకుమించి ఇప్పటికే ప్రతి ఎన్నికలోనూ అభాసుపాలవుతూ వస్తున్న కాంగ్రెస్‌కు.. గ్రేటర్‌‌లో అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది. మరి దానిని కాపాడుకోవాలంటే అందుకు తగినట్లుగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.

బీజేపీ ఆకర్ష్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతోంది. ఇప్పటికే కొప్పుల నరసింహ్మరెడ్డి బీజేపీలోకి చేరగా.. నేడు ఫతేనగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ ముద్దాపురం కృష్ణగౌడ్, మాజీ మేయర్ బాండ కార్తీక రెడ్డి బీజేపీలోకి చేరనున్న సంగతి తెలిసిందే. వీరి బాటలోనే మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్య అనుచరులను బీజేపీ లాగేసి టికెట్లు ఇచ్చి షాక్ ఇచ్చింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) నామినేషన్లకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్, భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ పార్టీకి, వారి పదవులకు రాజీనామా చేశారు. వీరిరువురూ బీజేపీలోకి చేరనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.