Begin typing your search above and press return to search.

అనుకున్నది సాధించిన రఘురామ.. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు షాక్!

By:  Tupaki Desk   |   10 Aug 2021 10:14 AM GMT
అనుకున్నది సాధించిన రఘురామ.. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు షాక్!
X
ఏపీ సీఎం వర్సెస్ అదే పార్టీకి చెందిన వైసీపీ ఎంపీ రఘురామకు మధ్య నడుస్తున్న పోరు మరో మలుపు తిరిగింది. ఏపీ ప్రభుత్వం మీద తరచూ ఫిర్యాదులు చేసే రఘురామ.. తాను అనుకున్నది ఎట్టకేలకు సాధించారు. తన పుట్టిన రోజున హైదరాబాద్ లో ఉన్న తనను అరెస్టు చేయటం.. ఆగమేఘాల మీద ఏపీకి తరలించటం.. ఆ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాల్ని జారీ చేసింది కేంద్రంలోని హోం శాఖ.

గతంలో నరసాపురం ఎంపీ చేసిన ఫిర్యాదుకు స్పందించిన కేంద్ర హోం శాఖ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో వైసీపీ బొమ్మపై పోటీ చేసి గెలిచిన రఘురామ.. తర్వాతి కాలంలో పార్టీ అధినేతపై విరుచుకుపడటం.. ఆయన ప్రభుత్వంపై విమర్శలు.. ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. నిత్యం ప్రభుత్వ విధానాల్లోని లోపాలతో పాటు.. ప్రభుత్వానికి దన్నుగా నిలుస్తున్నారంటూ కొందరు అధికారులపైనా.. ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి వార్తల్లో నిలిచే రఘురామ తాజాగా తాను టార్గెట్ చేసిన ఏపీ సీఐడీ చీఫ్ పైనా చర్యలకు కేంద్రం నిర్ణయం తీసుకునేలా చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.

అదే పనిగా ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు.. సోషల్ మీడియా.. మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై రాజద్రోహం కేసును నమోదు చేసిన ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్.. బెయిల్ కు వీల్లేని రీతిలో ఆయన్ను హైదరాబాద్ కు వెళ్లి మరీ అరెస్టు చేశారు. ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న సందర్భంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

తనపై దాడి జరిగినట్లుగా సుప్రీంకోర్టుకు ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు.ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీం సైతం కస్టడీలో ఉన్న రఘురామపై దాడి చేసినట్లుగా గుర్తించింది. ఇదే సమయంలో తనపై కస్టడీలో దాడి చేయించిన సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీద రగిలిపోతున్న రఘురామ.. పలువురికి ఆయనపై కంప్లైంట్లు చేశారు. ఓపక్క స్పీకర్ కు.. మరోవైపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆయన కంప్లైంట్లు ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సునీల్ కుమార్ పైన గతంలో ఉన్న కేసులు రఘురామకు కలిసి వచ్చేలా చేశాయి.

అందులో ఒకటి వరకట్నం కేసు కాగా.. మరొకటి ఆయన హిందూ మతంపై చేసిన వ్యతిరేఖ వ్యాఖ్యలు. ఈ రెండు అంశాలపై సమాచారాన్ని సేకరించిన రఘురామ.. వాటిని కేంద్రానికి చేరాల్సిన విధంగా చేర్చినట్లు చెబుతున్నారు. భారత సర్వీసు అధికారిగా ఉన్న సునీల్ పై చర్యలకు కేంద్రాన్ని ఆశ్రయించిన ఎంపీ రఘురామ.. తాను చేస్తున్నవి ఉత్తమాటలు కాదంటూ అందుకు తగ్గ సాక్ష్యాల్ని సమర్పించినట్లు చెబుతున్నారు. దీంతో.. వాటిని పరిశీలించిన కేంద్ర హోం శాఖ.. సునీల్ కుమార్ పై తమకు అందిన ప్రాథమిక సమాచారంతోపాటు.. విచారణ జరపగా.. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

దీంతో.. రఘురామ పంతం నెరవేరటమే కాదు.. ఆయన టార్గెట్ చేసిన సునీల్ కుమార్ పై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. మరిప్పుడు ఏపీ ముఖ్యమంత్రి సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో సునీల్ కుమార్ పై ఆయన భార్య అరుణ వరకట్న వేధింపుల కేసు పెట్టారు. అయితే.. ఆ కేసులో ఆయన అరెస్టు కాకుండా కోర్టు నుంచి మినహాయింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏపీ సీఐడీ చీఫ్ గా ఎంపికయ్యారు.

ఒక తీవ్రమైన కేసు నమోదైన వ్యక్తికి కీలక బాధ్యతలు ఎలా అప్పజెబుతారన్న ప్రశ్నను సంధించటం ద్వారా ఆయనపై చర్యలకుకేంద్రానికి సరైన కారణం లభించిందనిచెప్పాలి. మొత్తంగా సునీల్ కుమార్ పై చర్యలకు రగిలిపోతున్న ఎంపీ రఘరామకు తాజా పరిణామాలు ఊరట కలిగించటమే కాదు.. ఆయనలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.