Begin typing your search above and press return to search.

చిక్కుల్లో బాలక్రిష్ణ అల్లుడు? మళ్లీ షాక్.?

By:  Tupaki Desk   |   7 Feb 2020 1:33 PM IST
చిక్కుల్లో బాలక్రిష్ణ అల్లుడు? మళ్లీ షాక్.?
X
టాలీవుడ్ అగ్రహీరో, టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలక్రిష్ణ చిన్నల్లుడికి భారీ షాక్ తగిలినట్టు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. గీతం సంస్థల అధిపతిగా బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. మొన్నటి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి గా పోటీచేసి ఓడి పోయారు.

తాజాగా శ్రీభరత్ కు అబిడ్స్ లోని కరూర్ వైశ్యా బ్యాంక్ షాకిచ్చినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రుణాల చెల్లింపు ఎగవేసిన కారణంగా శ్రీభరత్ తండ్రి పట్టాభిరామారావు సహా ఇతర కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు హైదరాబాద్ లోని అబిడ్స్ కరూర్ వైశ్యా బ్యాంకు నోటీసులు జారీ చేసినట్టు మీడియా లో కథనాలు వెలువడ్డాయి.

టెక్నో యూనిక్ ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు తో శ్రీభరత్ కుటుంబ సభ్యులు కరూర్ వైశ్యా బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఆ అప్పు అసలు వడ్డీ కలిపి దాదాపు రూ.124 కోట్ల 39 లక్షల 21 వేల 485.08 రూపాయలు అయినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని జనవరి 21, 2020 లోగా చెల్లించాలని బ్యాంకు గతంలోనే నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

అయితే కరూర్ వైశ్యా బ్యాంకు నోటీసులకు శ్రీభరత్ కుటుంబం స్పందించలేదని తెలిసింది. దీంతో రుణం కోసం బ్యాంకు లో తాకట్టు పెట్టిన గాజువాక మండలం భీమిలి మండలంలోని భూములను స్వాధీనం చేసుకొని వేలం వేస్తామని బ్యాంకు తాజాగా నోటీసులు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి.

శ్రీభరత్ పై ఇప్పుడే కాదు గతంలోనూ ఆంధ్రా బ్యాంకు కు సుమారు రూ.100 కోట్ల రుణం ఎగవేసినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కరూర్ వైశ్యా బాంక్ కు ఎగవేత తో ఆస్తుల జప్తు నోటీస్ జారీ చేసినట్టు వచ్చిన వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.