Begin typing your search above and press return to search.

సర్వేకెళ్లిన తహసీల్దార్ నే చంపేశారు.. సీఎం సీరియస్

By:  Tupaki Desk   |   10 July 2020 11:34 AM GMT
సర్వేకెళ్లిన తహసీల్దార్ నే చంపేశారు.. సీఎం సీరియస్
X
ఓ భూ సర్వే చేయడానికి వెళ్లిన తహసీల్దార్ ను దారుణంగా కత్తితో పొడించి చంపేశారు. విధి నిర్వహణ లో భాగంగా సర్వే చేసి నివేదిక ఇవ్వడానికి వెళ్లిన తహసీల్దార్ హత్య పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సీఎం తో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ దారుణం చోటుచేసుకుంది. కర్ణాటకలోని కోలార్ జిల్లా కేజీఎఫ్ సమీపంలోని బంగారుపేటలో భూములకు చాలా రేటు ఉంది. బంగారు గనులున్న ప్రాంతం కావడం.. సారవంతమైన భూములు ఎక్కువగా ఉండడంతో రైతులు వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.

ఈ క్రమంలోనే బంగారుపేట నియోజకవర్గంలోని కారవంచి గ్రామంలో రిటైర్డ్ టీచర్ వెంకటపతి-రామమూర్తి అనే వ్యక్తుల మధ్య భూవివాదం చెలరేగింది. మా భూములు సర్వే చేసి పంచాలని ఇద్దరూ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

దీంతో తహసీల్దార్ చంద్ర మౌళేశ్వర్ భూములు సర్వే చేయడానికి వస్తున్నానని సమాచారం ఇచ్చారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను వెంట పిలుచుకొని వెళ్లాడు. ఈ ప్రాంతం రాయలసీమ ఫ్యాక్షన్ భూస్వాములకు పెట్టింది పేరు కావడంతో భయం భయం గానే తహసీల్దార్ వెళ్లాడు.

వారిద్దరి భూములు సర్వే చేసి హద్దు రాళ్లు పెట్టి సమంగా పంచేశాడు. అప్పటికే తనకు తక్కువగా వస్తే చంపేద్దామని డిసైడ్ వెంకటపతి జేబులో కత్తి పెట్టుకొని వచ్చాడు. తహసీల్దార్ చంద్రమౌళేశ్వర్ పై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. చాలా చోట్ల పొడిచి నీ అంతు చూస్తానంటూ హెచ్చరికలు పంపాడు. తహసీల్లార్ ను పొడిచిన రిటైర్డ్ టీచర్ వెంకటపతిని పట్టుకోవడానికి పోలీసులు సాహసం చేయలేకపోయారు.

తహసీల్దార్ ను కోలారులోని ఆస్పత్రికి తరలించగా చికిత్స విఫలమై గురువారం రాత్రి మరణించారు. వెంకటపతి పారి పోగా అతడి పోలీసులు ఆంధ్రా బర్డర్ లో పట్టుకున్నారు. నిందితుడి పై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రకటించారు.

తహసీల్దార్ హత్యపై సీఎం బీఎస్ యడియూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య, స్థానిక ఎమ్మెల్యే ఈ ఘటన పై సీరియస్ అయ్యారు. తహసీల్దార్ కుటుంబాని కి సీఎం 25 లక్షల పరిహారం ప్రకటించారు. ఆయన కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని సీఎం యడ్యూరప్ప ప్రకటించారు.