Begin typing your search above and press return to search.

షాక్.. న్యూజెర్సీలో కాల్పులు.. ఆరుగురు బలి

By:  Tupaki Desk   |   11 Dec 2019 4:06 AM GMT
షాక్.. న్యూజెర్సీలో కాల్పులు.. ఆరుగురు బలి
X
షాకింగ్ ఘటన ఒకటి న్యూజెర్సీ నగరంలో చోటు చేసుకుంది. తుపాకి కల్చర్ తో అమెరికా రక్తమోడటం కొత్తేం కాకున్నా.. తాజాగా చోటు చేసుకున్న వైనం లాంటివి అరుదుగా జరిగేవిగా చెప్పాలి. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో మొత్తం ఆరుగురు బలి కావటం షాకింగ్ గా మారింది. మరో ఇద్దరు పోలీసు అధికారులు.. ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. న్యూజెర్సీ నగరంలోని ఒక జనరల్ స్టోర్ లో చోటు చేసుకున్న ఈ దారుణంలోకి వెళితే..

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం న్యూజెర్సీలోని ఒక జనరల్ స్టోర్ వద్దకు ట్రక్కులో వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరపటం షురూ చేశారు. అప్పటివరకూ షాపింగ్ హడావుడిలో ఉన్న వారు ఉలిక్కిపడ్డారు. వారు స్పందించే లోపే కొందరి శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకెల్లాయి. దీంతో పలువురు నేలకొరిగారు.

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసుల పైనా దుండగులు కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య గంట పాటు భీకర కాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వందల రౌండ్లు కాల్పులు జరిగినట్లుగా చెబుతున్నారు. దుండగుల్ని అంతమొందించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.

ఈ ఉదంతంతో ఉలిక్కిపడ్డ అధికారయంత్రాంగం స్పందించి.. కాల్పులు ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి దగ్గర్లోని స్కూళ్లు.. ఇతర షాపుల్ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాల్పుల్లో ముగ్గురు పౌరులు.. ఇద్దరు అనుమానిత నిందితులతో పాటు ఒక పోలీసు అధికారి కాల్పుల్లో మరణించినట్లు గుర్తించారు. మరణించిన పోలీసు అధికారి తుపాకీ కల్చర్ కు వ్యతిరేకంగా పని చేసినోడు కావటం గమనార్హం. ఈ ఘటన మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. దీన్నో భయంకరమైన ఘటనగా అభివర్ణించారు. స్థానిక పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. అవసరమైన సాయాన్ని అందిస్తామని ఆయన చెప్పారు. ఈ ఉదంతం స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది.