Begin typing your search above and press return to search.

శోభాడే తాజా కవరింగ్ విన్నారా?

By:  Tupaki Desk   |   21 Aug 2016 9:48 AM GMT
శోభాడే తాజా కవరింగ్ విన్నారా?
X
మేధావితనం ఉండటంలో తప్పు లేదు కానీ మోతాదు మించకూడదు. ప్రతి విషయాన్ని రంధ్రాన్వేషణ చేస్తూ.. విమర్శలు చేయటమే పనిగా పెట్టుకుంటే ఒక రోజు కాకుంటే మరో రోజైనా తిప్పలు తప్పవు. ఆ విషయం ప్రముఖ రచయిత్రి శోభాడేకు తాజాగా అనుభవంలోకి వచ్చింది. ప్రతి విషయాన్ని తన మేధోతనంతో విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టటం.. నెగిటివ్ వ్యాఖ్యలు చేసే ధోరణి దేశంలోని కొందరు మేధావులకు అలవాటే. అలాంటి వారిలో ఒకరు శోభాడే. రియో ఒలింపిక్స్ లోకి వెళ్లిన క్రీడాకారుల గురించి శోభాడే చిరాకు పుట్టించే వ్యాఖ్య చేశారు.

భారత క్రీడాకారులకు పతకాలు రావని.. వారు కేవలం సెల్ఫీలు తీసుకోవటం కోసమే రియోకు వెళ్లారని.. వారిపై చేసిన ఖర్చంతా వృధా అంటూ శోభాడే గతంలో ట్వీట్ చేశారు. ప్రయత్నం మొదలు పెట్టారో లేదో.. వెనువెంటనే విమర్శలతో విరుచుకుపడే శోభాడేపై చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ కలిసి సోషల్ మీడియా సాక్షిగా ఏసేసుకున్నారు. ప్రముఖులు సైతం శోభాడేను తిట్టిపోశారు. దేశ ప్రజల భావోద్వేగాల్ని తన వ్యాఖ్యలు ఎంతగా డిస్ట్రబ్ చేశాయన్న విషయాన్ని గుర్తించిన ఆమె.. తాజాగా దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు.

ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన తెలుగుతేజం సింధు.. సాక్షి మాలిక్ లను ఆమె పొగడ్తలతో ముంచెత్తారు. రజత పతకాన్ని సాధించిన సిందు 24 క్యారెట్ల బంగారమని.. ఆమె హీరోగా అభివర్ణిస్తూ పొగిడేశారు. ‘’24 క్యారెట్ల బంగారమా.. మేం నిన్ను ప్రేమిస్తున్నాం’’ అంటూ ట్విట్టర్ లో కీర్తించారు. ఈ సందర్భంగా పీవీ సింధు.. సాక్షి.. దీపల విజయగాథలను పోస్ట్ చేశారు.

పనిలో పనిగా సింధు జీవితంపై సినిమా తీయాలని.. అందులో సింధు క్యారెక్టర్ ను దీపికా పదుకునే కంటే ఇంకెవరు బాగా నటిస్తారని సరదాగా వ్యాఖ్యానించిన ఆమె తీరు చూస్తే.. తన వ్యాఖ్యలతో మండిపడుతున్న జనాల్ని కూల్ చేసే ప్రయత్నం చేశారని చెప్పాలి. రియో పోటీలకు వెళ్లిన క్రీడాకారులపై ఇన్నేసి వ్యాఖ్యలు చేసిన ఈ రచయిత్రి.. తనకుతాను దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చు అవార్డుల్ని ఎన్ని సాధించారు. ఎదుటోళ్లను విమర్శించేటప్పుడు తమ తమ రంగాల్లో తాము పీకిందేమిటన్నది గుర్తు చేసుకొని మాట్లాడితే సబబుగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.