Begin typing your search above and press return to search.

చిరు పార్టీ ఫైర్ బ్రాండ్‌..బాబు పార్టీలో!

By:  Tupaki Desk   |   8 Sep 2017 11:18 AM GMT
చిరు పార్టీ ఫైర్ బ్రాండ్‌..బాబు పార్టీలో!
X
అప్పుడెప్పుడో...2009 ఎన్నిక‌ల‌కు ముందు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ కార‌ణంగా చాలా మంది నేత‌ల‌కు బాగానే గుర్తింపు వ‌చ్చింది. అలాంటి వారిలో ఆ పార్టీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలిగా ప‌నిచేసిన శోభారాణి ఒక‌రుగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే... పార్టీలో మెరుగైన ప‌నితీరు కంటే కూడా వివాదాల కార‌ణంగానే ప్రాచుర్యంలోకి వ‌చ్చిన శోభారాణి... ప్ర‌జారాజ్యం పార్టీ క‌నుమ‌రుగు కాక‌ముందే తెర మ‌రుగైపోయారు. నాడు చిరుకు అత్యంత స‌న్నిహితులుగా పేరుప‌డ్డ వారిలో ఒక‌రిగా నిలిచిన ఇప్ప‌టి ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌... ప్ర‌జారాజ్యంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తే... వాటిని తిప్పికొట్ట‌డంలో శోభారాణి చూపిన తెగువ ఎవ్వ‌రూ మ‌రిచిపోలేనిదే. ప‌ర‌కాల వంటి సీనియ‌ర్ వ్యాఖ్య‌ల‌ను చీల్చి చెండాడిన శోభారాణి... కొంత‌కాలానికే ప‌ర‌కాల బాట‌లోనే ప్ర‌జారాజ్యంపై విమ‌ర్శ‌లు గుప్పించి మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు.

అంత‌టితో ఆగ‌ని శోభారాణి పార్టీ అధ్య‌క్షుడు చిరంజీవికే లేఖ రాశారు. *ప్ర‌జారాజ్యం పార్టీలో సామాజిక న్యాయం ఏది!? అంటూ* పార్టీ అధినేత చిరంజీవికే లేఖ రాసి నిల‌దీశారు. అనంత‌రం ఆమె పార్టీ క్రమశిక్షణ కమిటీకి మ‌రో లేఖ రాస్తూ....*నాపై చర్యలు తీసుకునే ముందు చిరంజీవి ఆశయాలను పని గట్టుకుని నాశనం చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలి* అని డిమాండ్ చేశారు. ఇక అదే వ‌రుస‌లో టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌తో పెళ్లి చేసుకున్నారంటూ శోభారాణిపై లెక్క‌లేన‌న్ని క‌థ‌నాలు వ‌చ్చేశాయి. ఈ వార్త‌లతో మ‌రింతగా జ‌నం నోళ్ల‌లో నానిన శోభారాణి ఆ వార్త‌ల‌ను కొట్టేశారు. ఆ త‌ర్వాత అడ్రెస్ లేకుండా పోయారు. ఇదంతా జ‌రిగి దాదాపుగా తొమ్మిదేళ్ల‌వుతోంది. నాటి నుంచి ఏ ఒక్కరికి కూడా క‌నిపించ‌కుండా పోయిన శోభారాణి నిన్న హఠాత్తుగా గుంటూరులోని టీడీపీ కార్యాల‌యంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి న‌క్కా ఆనంద‌బాబు, ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు జీవీ ఆంజ‌నేయులు స‌మ‌క్షంలో ఆమె టీడీపీలో చేరిపోయారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ శ్రేణులు ఈ విష‌యాన్ని బాగా ప్ర‌చారం చేసుకున్నాయి. అప్పుడెప్పుడో త‌మ పార్టీని వీడిన మ‌హిళా నేత తిరిగి త‌మ సొంత గూటికి చేరారంటూ సంతోషం వ్య‌క్తం చేశారు. నాడు పార్టీ అధినేత చంద్ర‌బాబుతో పొస‌గ‌ని కార‌ణంగానే శోభారాణి పార్టీని వీడారంటూ టీడీపీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. అయినా ప్ర‌జారాజ్యం పార్టీ వ‌చ్చేదాకా శోభారాణి ఎవ‌రో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంటే... ఇప్పుడేమో ఓ స‌మ‌ర్థ‌వంత‌మైన మ‌హిళా నేత తిరిగి త‌మ గూటికి వ‌చ్చిందంటూ టీడీపీ వ‌ర్గాలు జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్న వైనంపై ఆ పార్టీలోప‌లే ఓ త‌ర‌హాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఏది ఏమైనా... ఓ మ‌హిళా రాజ‌కీయ వేత్త‌... కొంత కాలం పాటు పాలిటిక్స్‌కు దూరంగా ఉండి తిరిగి రాజ‌కీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధ‌మ‌య్యారంటే... అంద‌రూ స్వాగ‌తించాల్సిన విష‌య‌మే. మ‌రి ఈ సారైనా శోభారాణికి తెలుగు తమ్ముళ్లు త‌గిన గుర్తింపు ఇస్తారో, లేదో చూడాలి.