Begin typing your search above and press return to search.

కోహ్లీ వైఫ్‌ అనుష్క శర్మకు.. షోయబ్ అక్తర్ వార్నింగ్..!

By:  Tupaki Desk   |   25 July 2021 5:39 AM GMT
కోహ్లీ వైఫ్‌ అనుష్క శర్మకు.. షోయబ్ అక్తర్ వార్నింగ్..!
X
సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే క‌పుల్స్ లో.. టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ- అనుష్క శ‌ర్మ ముందు వ‌ర‌స‌లో ఉంటారు. అటు క్రికెట‌ర్ గా స‌క్సెస్ ఫుల్ కెరీర్ ను కొన‌సాగిస్తున్న విరాట్‌.. ఫ్యామిలీ మెన్ గానూ త‌న‌ని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ ఇంగ్లండ్ టూర్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇప్పుడు మీడియాలో, సోష‌ల్ మీడియాలో ఓ విష‌యం ట్రెండ్ అవుతోంది. అది ఏమంటే.. పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టార్‌.. రావ‌ల్పిండి ఎక్స్ ప్రెస్ షోయ‌బ్ అక్త‌ర్.. కోహ్లీ స‌తీమ‌ణి అనుష్క వ‌ర్మ‌కు వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. ఇది కూడా ఎవ‌రో చెప్పింది కాదు.. స్వ‌యంగా షోయ‌బ్ అక్త‌రే చెప్పాడు. దీంతో.. ఈ విష‌యం వైర‌ల్ అయ్యింది. మ‌రి, ఇంత‌కీ షోయ‌బ్ అక్త‌ర్ ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడు? అస‌లు వార్నింగ్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏంటీ? అన్న‌ది ఇప్పుడు చూద్దాం.

టీమిండియా కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ టాలెంట్ ఏంట‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుత క్రికెట్లో ప్ర‌పంచంలోనే బెస్ట్ బ్యాట్స్ మెన్ గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. టెస్టు, వ‌న్డే, టీ20 మూడు ఫార్మాట్ల‌లోనూ కోహ్లీ ప్ర‌ద‌ర్శ‌న అద్భుతంగా ఉంది. ఈ త‌రంలో నంబ‌ర్ వ‌న్ బ్యాట్స్ మెన్ ఎవ‌రు అన్న‌ప్పుడు.. ప్ర‌పంచంలోని మాజీ దిగ్గ‌జాలు కూడా కోహ్లీ వైపే వేలు చూపిస్తున్నారు. ఇప్ప‌టికే.. వ‌న్డేలు, టెస్టులు కలిపి 70 అంత‌ర్జాతీయ శ‌త‌కాలు చేశాడు. వ‌న్డేల్లో 12 వేలు, టెస్టుల్లో 10 వేల ప‌రుగుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాడు. ఇది న‌మ్మ‌శ‌క్యం కాని ప్ర‌ద‌ర్శ‌న‌గా చెబుతుంటారు. ఇలాంటి కోహ్లీ ధోనీ అర్థంత‌రంగా టెస్టు కెప్టెన్సీ వ‌దులు కోవ‌డంతో.. కోహ్లీ జ‌ట్టు ప‌గ్గాలు అందుకున్నాడు.

2014లో ఆస్ట్రేలియా టూర్ మ‌ధ్య‌లోనే ధోనీ కెప్టెన్సీని వ‌దిలేసుకున్నాడు. దీంతో.. అనివార్యంగా కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. ఈ విష‌యాన్ని గుర్తు చేసిన షోయ‌బ్ అక్త‌ర్‌.. ఈ అంశంలో అనుష్క శ‌ర్మ‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్టు చెప్పాడు. ‘‘ధోనీ అనంతరం టీమిండియా కెప్టెన్ గా కోహ్లీని ఎంపిక చేసినప్పుడు నేను భ‌య‌ప‌డ్డాను.’’ అని షోయబ్ వెల్లడించాడు. కోహ్లీ అప్పటికి అద్భుతంగా రాణిస్తున్నాడని, అయితే.. కెప్టెన్ గా ఎంపిక చేయ‌డం వ‌ల్ల అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని, ఇది ఆట‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని తాను భావించాన‌ని అక్త‌ర్ చెప్పాడు. ఇదే విష‌యాన్ని అనుష్క ద‌గ్గ‌ర ప్ర‌స్తావించి, ప‌రోక్షంగా వార్నింగ్ ఇచ్చిన‌ట్టు చెప్పాడు.

ధోనీ కెప్టెన్సీ వ‌దులుకున్న‌ప్పుడు కోహ్లీ వ‌య‌సు కేవ‌లం పాతిక సంత్స‌రాలు ఉంద‌ని. అప్పుడు అద్భుతంగా బ్యాటింగ్ లో రాణిస్తున్న కోహ్లీకి.. కెప్టెన్సీ భారంగా మారుతుంద‌ని తాను సందేహించిన‌ట్టు చెప్పాడు. ఈ విష‌యాన్ని అనుష్క ష‌ర్మ‌కు వివ‌రిస్తూ.. ‘‘బ్యాట్స్ మన్ గా అద్భుతంగా రాణిస్తున్న తొలి నాళ్లలోనే విరాట్ కోహ్లీపై కెప్టెన్సీ భారం మోపారు. సారధ్య బాధ్యతల వల్ల అతడిపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆలోచించుకోండి’’ అని అనుష్క‌కు చెప్పాడట. ‘‘ఒక‌ర‌కంగా చిన్న‌పాటి వార్నింగ్ ఇచ్చాన‌ని అనుకోండి’’ అంటూ పాత సంగతుల్ని చెప్పుకొచ్చాడు అక్తర్.

క్రికెట్ ను అమితంగా ఆరాధించే దేశంలో కెప్టెన్ గా విఫ‌ల‌మైతే.. అత‌డిపై వ‌చ్చే విమ‌ర్శ‌లు ప్ర‌మాద‌క‌రంగా ఉంటాయ‌ని భావించాన‌ని చెప్పాడు షోయ‌బ్‌. అయితే.. ఈ స‌మ‌స్య‌ల‌ను చాక‌చ‌క్యంతో కోహ్లీ అధిగ‌మించాడ‌ని కితాబిచ్చాడు. త‌న‌కు అనుకూలంగా ఉండే పిచ్ ల‌లో ఐదుగురు బౌల‌ర్ల‌తో ఆడుతాడ‌ని, బౌల‌ర్ల‌లో దూకుడు స్వభావాన్ని నింపుతాడ‌ని చెప్పాడు. ఇక‌, మైదానంలో కోహ్లీ కెప్టెన్ గా కాకుండా.. ఒక బౌల‌ర్ మాదిరిగా క‌నిపిస్తాడని, అత‌ని కెప్టెన్సీలో భార‌త పేస్ ఎటాక్ దృఢంగా మారింద‌ని షోయ‌బ్ మెచ్చుకున్నాడు.