Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ టూర్ కు న్యూజిలాండ్ నో.. విరుచుకుపడ్డ అక్తర్, అఫ్రిది

By:  Tupaki Desk   |   17 Sep 2021 4:30 PM GMT
పాకిస్తాన్ టూర్ కు న్యూజిలాండ్ నో.. విరుచుకుపడ్డ అక్తర్, అఫ్రిది
X
పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఆఖరి నిమిషంలో టోర్నీని పూర్తిగా రద్దు చేసుకుంది. భద్రతా కారణాల రీత్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఆటగాళ్ల భద్రతే తమకు అన్నింటికన్న ముఖ్యమని స్పష్టం చేసింది. తమ ఆటగాళ్లను తిరిగి న్యూజిలాండ్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ వెల్లడించారు.

పాకిస్తాన్ లో పర్యటించిన శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రవాదుల కాల్పుల తర్వాత ఏ దేశం కూడా పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచ్ లు ఆడడానికి సాహసించడం లేదు. వైట్ బాల్ క్రికెట్ సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టు తొలి వన్డేకు కొన్ని నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా మొత్తం సిరీస్ ను రద్దు చేసుకోవడం సంచలనమైంది. న్యూజిలాండ్ భద్రతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో కివీస్ క్రికెటర్లు హోటల్ రూముల నుంచి బయటకు రాలేదు. ప్రస్తుతం తిరిగి స్వదేశం వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ పరిణామం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి గట్టి షాక్ గా మారింది. ఈ విషయంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం కలుగజేసుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాళ్ల భద్రతపై ఆదేశ ప్రధానితో మాట్లాడాడు. అయినా న్యూజిలాండ్ దేశ ఆటగాళ్లు ఉన్న ఫళంగా టోర్నీని రద్దు చేసుకున్నారు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లను తిరిగి దేశం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.

భద్రతా కారణాలను చూపి న్యూజిలాండ్ జట్టు సిరీస్ ను రద్దు చేసుకోవడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయాబ్ అక్తర్ తీవ్రంగా స్పందించారు. సెక్యూరిటీ హెచ్చరిక లేదు.. ఏమీ లేదని.. అదంతా ఉత్తిదేనని అఫ్రిది కొట్టిపారేశాడు. హామీ ఇచ్చినా సిరీస్ ను రద్దు చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. మీ నిర్ణయం ప్రభావం ఎంతలా ఉంటుందో తెలుసా? అని ప్రశ్నించారు. ఇక షోయాబ్ అక్తర్ అయితే ‘పాక్ క్రికెట్ ను న్యూజిలాండ్ చంపేసింది’ అని ఘాటు ట్వీట్ చేసి విమర్శించాడు.

పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు శుక్రవారం నుంచి మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం రావాల్పిండిలో ప్రారంభం కావాల్సిన తొలి వన్డే నిర్ణీత సమయానికి మొదలు కాలేదు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే భద్రతా కారణాలతో ఈ పర్యటనను విరమించుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.