Begin typing your search above and press return to search.

పాక్ క్రికెట్ పై అక్తర్ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   17 Oct 2016 4:37 PM GMT
పాక్ క్రికెట్ పై అక్తర్ సంచలన వ్యాఖ్యలు!
X
అంతర్జాతీయ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది సంచలన విషయం. ఈ వ్యవహారంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబందాలుండటంతో చాలా మంది అద్భుతమైన క్రికెటర్ల కెరీర్ నాశనం అయిపోయింది. పేర్లు చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ లో దేశాలకు అతీతంగా చాలామందే ఉంటారు. అయితే జీవితంలో ఒక్కసారి ఈ ఆరోపణలు రావడం, అవి వాస్తవాలని తెలిసి ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేదం విదిస్తే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందని ఇప్పటికే చాలా సంఘటనలు గుర్తుచేస్తున్నాయి. అయితే తాజాగా పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఫిక్సింగ్ పైనా - పాకిస్థాన్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

1996లో అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ఫిక‍్సింగ్ తారస్థాయికి చేరుకుందని చెబుతున్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ఆ రోజుల్లో పాకిస్థాన్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ మొత్తం అపరిచితులతో నిండి, అత్యంత చెత్తగా ఉండేదని అక్తర్ తెలిపాడు. ఇదే సమయంలో తాను మాత్రం ఫిక్సింగ్ ముఠాకు దూరంగానే ఉండేవాడినని, తాను మాత్రమే దూరంగా ఉండటం కాకుండా... ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని, నిబద్ధతతో క్రికెట్ ఆడాలని ఇతర క్రికెటర్లకు కూడా సలహా ఇచ్చేవాడినని చెప్పాడు. అలాగే 2010లో ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ను కూడా అప్పట్లో తాను హెచ్చరించానని అక్తర్ తెలిపాడు.

ఆ ఫిక్సింగ్ సంచలన వ్యాఖ్యల అనంతరం ఇటీవల బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శించుకున్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్లు జావేద్ మియాందాద్, షాహిద్ అఫ్రిదీ లపై కూడా అక్తర్ స్పందించాడు. ఇలా వీదికెక్కి వీరంగం ఆడకుండా ఉండాలి అని సున్నితంగా చెప్పే క్రమంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు అక్తర్. కాగా గతంలో కూడా ఒకసారి పాకిస్థాన్ జట్టు సభ్యులపై అక్తర్ సంచలన కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని సభ్యుల్లో చాలా మంది మానసికంగా దెబ్బతిన్నారని, వారి మానసిక పరిస్థితి ఏమీ బాగా లేదని, ఆటగాళ్లలో నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు కోచ్ ప్రయత్నించాలని అక్తర్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/