Begin typing your search above and press return to search.

నిన్న ట్రంప్ ...రేపు నితీశ్...ఓటమి తప్పదన్న శివసేన

By:  Tupaki Desk   |   9 Nov 2020 5:20 PM GMT
నిన్న ట్రంప్ ...రేపు నితీశ్...ఓటమి తప్పదన్న శివసేన
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున బరిలోకి దిగిన జో బైడెన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగిన అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటాపోటీ పోరులో పరాజయం పాలయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడని పలు మార్లు ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పారు. తమ దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని రెచ్చగొట్టడంతో పాటు ముస్లిం ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసం తీసుకున్న పలు నిర్ణయాల్లో ట్రంప్, మోడీలకు సారూప్యత ఉందని, అందుకే వీరిద్దరూ మంచి మిత్రులని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అయితే, తాజాగా ట్రంప్ ఓటమి నేపథ్యంలో మోడీపై, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలపై కూడా భారత్ లోని కొన్ని పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ ఓటమి పాలైనట్టు బిహార్‌లో బీజేపీతో జతకట్టిన నితీశ్ కూడా ఓటమి పాలవ్వక తప్పదని శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రంప్‌ నకు పట్టిన గతే నితీశ్‌కు పడుతుందని తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన సంచలన వ్యాసాన్ని ప్రచురించింది.

బిహార్ లో మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ముందు మోడీ, నితీశ్ లు నిలబడలేకపోయారని శివసేన వ్యాఖ్యానించింది. అబద్ధాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా జో బైడెన్, తేజస్వీ పోరాడారని, బైడెన్ తరహాలో తేజస్వి కూడా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. వ్యాఖ్యానించింది. ట్రంప్ ఓటమి నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించింది. తమ తప్పును అమెరికన్లు సరిదిద్దుకున్నారని, బిహార్ ప్రజలు కూడా అదే బాటలో పయనించారన్న సత్యం త్వరలో వెలుగులోకి వస్తుందని చెప్పింది. తనకు ప్రత్యామ్నాయం లేదని నిరుద్యోగులను ట్రంప్ విస్మరించి మూల్యం చెల్లించుకున్నారని, అదే తరహాలో నితీశ్ కు కూడా భంగపాటు తప్పదని తెలిపింది. అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ విజయాన్ని ట్రంప్ ఖండిస్తున్నారని, అటువంటి ట్రంప్ నకు మోడీ, బీజేపీ నేతలు మద్దతిస్తున్నారుని దుయ్యబట్టింది. నిన్న ట్రంప్ ...రేపు నితీశ్...తర్వాత మోడీ...అంటూ శివసేన జోస్యం చెప్పింది.