Begin typing your search above and press return to search.

ఆర్నబ్ కు చిక్కులు తప్పవా?

By:  Tupaki Desk   |   9 Sep 2020 11:30 AM GMT
ఆర్నబ్ కు చిక్కులు తప్పవా?
X
దేశంలో చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. వారిలో సెలబ్రిటీ జర్నలిస్టులకు కొదవలేదు. పవర్ సెంట్రిక్ గా ఉండే వారెందరో. అందరి దారి ఒకటైతే.. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నబ్ రూట్ కాస్త డిఫరెంట్. కెమేరా ముందుకు ఆయన చెలరేగిపోయే తీరు చూస్తే.. దేశంలో ఒక జర్నలిస్టు ఇంతలా విరుచుకుపడటం సాధ్యమా? అన్న సందేహం రాక మానదు. అయితే.. ఆర్నబ్ చాలా తెలివైనోడు.

రిపబ్లిక్ చానల్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్న తర్వాత.. కొందరిని వ్యూహాత్మకంగా టార్గెట్ చేయటమే కాదు.. దేశం నిలదీస్తుంది? దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ విరుచుకుపడటమే కాదు.. కొన్ని సందర్భాల్లో అతగాడి ఆవేశాన్ని చూసే వీక్షకులకు బీపీ పెరిగిపోయేలా చేస్తుంటారు. తాను డిసైడ్ అయిన స్టాండ్ కు గట్టిగా నిలబడటమే కాదు.. ఎదుటోడు ఎంతటి వాడైనా సరే.. విరుచుకుపడటం అలవాటు. అదేసమయంలో తనకున్న పరిమితుల గురించి బాగా తెలిసిన వ్యక్తి.

గతంలో శివసేన చీఫ్ మీద విరుచుకుపడేందుకు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించే ఆయన.. ఇప్పుడు మాత్రం ఏ మాత్రం లెక్కచేయటం లేదు. ఎంతటి ప్రముఖుడైనా సరే.. పేరు పెట్టి సూటిగా ప్రశ్నించే అతగాడు.. ముఖ్యమంత్రిని సైతం పేరు పలికి.. కాస్తంత గ్యాప్ ఇచ్చి.. ‘జీ’ అని తగిలించే తీరులోనే ఆర్నబ్ టాలెంట్ ఇట్టే అర్థమైపోతుంది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఎపిసోడ్ లో సేన సర్కారును టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిన అతగాడు.. గడిచిన కొద్దిరోజులుగా ఎంతలా చెలరేగిపోతున్నారో తెలిసిందే. అంతకంతకూ విరుచుకుపడుతున్న ఆర్నబ్ దూకుడుకు పగ్గాలు వేయాలని డిసైడ్ అయ్యింది ఉద్దవ్ సర్కారు. తాజాగా అతగాడి గురించి మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశ పెట్టి మరీ చర్చించటం గమనార్హం.

ఆర్నబ్ కు వ్యతిరేకంగా తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టింది మరెవరో కాదు..శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయిక్ . ఈ తీర్మానం కారణంగా అరగంట పాటు అసెంబ్లీ కార్యకలాపాలు స్తంభించిపోయింది. అధికారపార్టీ అనుకున్న తర్వాత తీర్మానం ఆమోదించకుండా ఉంటారా? అలానే జరిగింది. తాజా పరిణామాల్ని చూస్తే.. త్వరలోనే ఆర్నబ్ కు వ్యతిరేకంగా సభ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఆర్నబ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మహారాష్ట్ర మంత్రి తీరు చూస్తే.. తమకు వ్యతిరేకంగా గళం వినిపించే వారికి చెక్ పెట్టాలన్న ఆత్రుత ఇట్టే అర్థమైపోతుంది.

ఒక జర్నలిస్టుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇదే అసెంబ్లీ వారి భద్రత కోసం చట్టం చేశారు. కానీ.. ఒక జర్నలిస్టే ఒక ప్రజాప్రతినిధి గురించి ఏదైనా అంటే అతడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలా? వద్దా? అంటూ మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆర్నబ్ విషయంలో సేన సర్కారు లక్ష్యం స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను ఉద్దేశించి అర్నబ్ ప్రయోగించే భాషను తీవ్రంగా తప్పు పడుతున్నారు శివసేన ప్రజాప్రతినిదులు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ప్రముఖుల ప్రతిష్ఠను మంటగలపాలన్న ప్రయత్నం చేస్తున్నారని.. అతడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆర్నబ్ ను మరిన్ని చిక్కుల్లో పడేసేందుకు వీలుగా కొత్త మార్గాల్ని సేన సర్కారు అన్వేషిస్తుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే అన్వయ్ నాయక్ కేసును బయటకు తీశారు. 2018లో ఈ మరాఠీ ఇంటీరియర్ డిజైనర్ సూసైడ్ చేసుకున్నాడు. అతడి సూసైడ్ నోట్ లో.. తాను ఆర్నబ్ కు చెందిన రిపబ్లిక్ చానల్ స్టూడియోకు ఇంటీరియర్ చేశారు. అతడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని.. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి అతడి భార్య.. కుమార్తె కంప్లైంట్ చేసినట్లుగా శివసేన మంత్రి అనిల్ చెబుతున్నారు. తాము టార్గెట్ చేసినట్లు ఆర్నబ్ ను సేన ఫిక్స్ చేసేంత సీన్ ఉందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.