Begin typing your search above and press return to search.

కొత్త పార్టీ పెట్ట‌నున్న సీఎం బాబాయి

By:  Tupaki Desk   |   31 Jan 2017 11:23 AM GMT
కొత్త పార్టీ పెట్ట‌నున్న సీఎం బాబాయి
X
ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో నెల‌కొన్న కుటుంబ రాజ‌కీయాల కుంప‌ట్లు తారాస్థాయికి చేరిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ సోదరుడు అయిన శివపాల్ యాదవ్ ఆశ్చ‌ర్య‌క‌ర ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే మార్చిలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన శివ‌పాల్ యాద‌వ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాదీ అభ్యర్థిగానే పోటీలో ఉంటానని, అయితే మార్చిలో మాత్రం తాను కొత్త పార్టీ స్థాపించడం ఖాయమన్నారు. స‌మాజ్ వాదీ అభిమానుల ఆకాంక్ష‌ను నెరవేర్చేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు శివ‌పాల్ యాద‌వ్ వివరించారు.

ఇదిలాఉండ‌గా...యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లలో కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా పోటీ చేయాలని ఎస్పీ వ్యవ స్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ తన మద్దతుదారులను ఆదేశించారు. ''105 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తూంటే మేం చూస్తూ కూర్చోవాలా? మా పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. ఇది సరైంది కాదు. పార్టీని నేను నాశనం కానివ్వను'' అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆ మ‌రుస‌టి రోజే శివ‌పాల్ యాద‌వ్ ఈ విధ‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజారిటీతో అధికారానికి వస్తుందని టైమ్స్‌నౌ-వీఎంఆర్ సర్వే అంచనా వేసింది. యూపీ ప్రజల్లో అత్యధికులు అఖిలేశ్ యాదవ్‌నే సీఎం కోరుకుంటుండగా, ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు తెలిపిన వారు కూడా భారీగానే ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 34 శాతం ఓట్లతో 202 సీట్లు దక్కించుకుంటుందని ఆ సర్వే వెల్లడించింది. అధికార సమాజ్‌ వాదీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఈ కూటమికి 147 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. ఇక ఈసారి అధికారానికి వస్తామని గట్టిగా నమ్ముతున్న బీఎస్పీకి 24 శాతం ఓట్లు లభించే అవకాశమున్నప్పటికీ సీట్లు 47 మాత్రమే వస్తాయని పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/