Begin typing your search above and press return to search.

ములాయం కొత్త పార్టీ పెట్టేస్తున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   5 May 2017 8:44 AM GMT
ములాయం కొత్త పార్టీ పెట్టేస్తున్నార‌ట‌!
X
దేశ రాజ‌కీయాల‌నే మ‌లుపు తిప్ప‌గ‌ల శ‌క్తి ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ పురుడు పోసుకుంటోంది. ఆ కొత్త పార్టీ పురుడు పోసుకుంటున్న‌ది ఏ అనామ‌కుడి చేతిలోనో కాదండి బాబూ... యూపీ రాజ‌కీయాల‌నే ఓ కుదుపు కుదిపేసి... రాజ‌కీయాల్లో న‌వ శ‌కానికి నాందీ ప‌లికిన రాజ‌కీయ కురువృద్ధుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్ చేతిలో. అయినా ములాయం స్థాపించిన సమాజ్ వాదీ పార్టీ ఉండ‌గా, ఆయ‌న‌కు ఇంకో కొత్త పార్టీతో అవ‌స‌రం ఏమొచ్చింద‌నేగా మీ అనుమానం.

ఇటీవ‌ల యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందుగా స‌మాజ్ వాదీ పార్టీలో నెల‌కొన్న ముస‌లం, ఆ త‌ర్వాత తండ్రిని పార్టీ నుంచి బ‌హిష్క‌రించేసి... తానే పార్టీ అధ్య‌క్షుడినంటూ ములాయం కుమారుడు, ఆ రాష్ట్రానికి నాడు సీఎంగా వ్య‌వ‌హ‌రించిన అఖిలేశ్ సింగ్ యాద‌వ్ ప్ర‌క‌టించుకున్న సంగ‌తి తెలిసిందేగా. ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాదీ పార్టీని చిత్తు చేసి ఆ పార్టీ చేతిలోని అధికారాన్ని బీజేపీ అతి సునాయ‌సంగా లాగేసుకుంది. ఈ షాక్‌తో తండ్రితో రాజీకే అఖిలేశ్ మొగ్గు చూపినా... ములాయం సోద‌రుడు, అఖిలేశ్ బాబాయి శివ‌పాల్ యాద‌వ్‌కు పార్టీ ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ట‌.

ఈ క్ర‌మంలో క‌ష్ట‌స‌మ‌యంలో త‌న వెన‌కున్న సోద‌రుడి మాట‌కే ములాయం విలువ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో త‌న క‌న్న కొడుకు రాజీని అంత‌గా ప‌ట్టించుకోని ములాయం.. సోద‌రుడు శివ‌పాల్ చెప్పిన ప్ర‌తి మాట‌కు కూడా త‌లూపేస్తున్నారు. త‌న మాట‌కు అన్న‌గారి నుంచి తిర‌స్కారం రాద‌న్న ధైర్యంతో నిన్న శివ‌పాల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆ ప్ర‌క‌ట‌న సారాంశం ఏంటంటే... యూపీ రాజ‌కీయాల్లో మ‌రో కొత్త పొలిటిక‌ల్ పార్టీ పురుడు పోసుకుంటుంద‌ట‌. ఆ పార్టీ ములాయమే నేతృత్వం వ‌హిస్తార‌ట‌.

ఈ ప్ర‌తిపాద‌న‌కు ములాయం ఏమ‌న్నారో తెలియ‌దు గానీ.. శివ‌పాల్ మాత్రం పార్టీ పేరును కూడా ప్ర‌క‌టించేశారు. 'సమాజ్‌ వాదీ సెక్యులర్ మోర్చా పేరిట ఏర్పాటు కానున్న ఈ పార్టీ ల‌క్ష్యం... ఎన్నిక‌ల్లో ఓట‌మితో చెల్లాచెదురైన స‌మాజ్ వాదీ పార్టీ నేత‌లంద‌రినీ ఒక ద‌రికి చేర్చ‌డ‌మేన‌ట‌. చూద్దాం మ‌రి సోద‌రుడి మాట‌కు ములాయం కూడా ఊకొడ‌తారో? లేక పార్టీని పురిట్లోనే చంపేస్తారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/