Begin typing your search above and press return to search.

ఎస్పీలో పరిస్థితి.. తోసిపాడేసిన బాబాయ్!

By:  Tupaki Desk   |   5 Nov 2016 5:13 PM IST
ఎస్పీలో పరిస్థితి.. తోసిపాడేసిన బాబాయ్!
X
సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత విభేదాలు మామూలుగా లేవు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇవి బహిర్గతమైన సంగతి తెలిసిందే. నిన్నటివరకూ మీడియా ముందు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుకుంటూ వచ్చిన బాబాయ్ శివపాల్ యాదవ్... తాజాగా మరోసారి అబ్బాయిపై తనకున్న అక్కసును బహిరంగంగానే వెల్లగక్కారు. దీనికి సమాజ్‌ వాదీ పార్టీ రజతోత్సవ వేడుక వేదికైంది.

వచ్చే ఏడాది ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో రోజు రోజుకీ సమాజ్ వాదీపార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోతూనే ఉన్నాయి.. ఈ క్రమంలో ఇవి మరోసారి భగ్గుమన్నాయి. కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లక్నోలో జరిగిన ఈ రజతోత్సవ వేడుక బాబాయ్‌ శివ్‌ పాల్‌ యాదవ్‌ - సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధానికి వేదికగా మారింది. పార్టీ శ్రేణులు, ప్రజల ముందే ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పరోక్ష వాగ్బాణాలు సంధించుకున్నారు.

తొలుత ప్రసంగించిన శివపాల్ యాదవ్... తాను ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని, కావాలంటే రక్తం ధారపోస్తానని అన్నారు. అనంతరం మాట్లాడిన అఖిలేష్... "కొంతమంది మాట వింటారు గానీ పార్టీ మొత్తం నాశనం అయిన తర్వాతే వింటారు.. ఎవరూ పరీక్షలకు సిద్ధపడాల్సిన అవసరం లేదు, ఎవరైనా తమంతట తాముగా పరీక్షకు వస్తానంటే తాను సిద్ధంగా ఉన్నాను" అని చెప్పాలనుకున్నది చెప్పేశారు.

ఇదంతా ఒకెత్తు అయితే ఈ సభా వేదికపై జరిగిన ఒక సంఘటన మరొకెత్తు! ఈ సభలో ఎస్పీ నేత జావేద్‌ అబిదీ.. అఖిలేశ్‌ కు మద్దతుగా ఆవేశపూరితంగా ప్రసంగించారు. 2017 ఎన్నికలకు ముందే అఖిలేశ్‌ ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. బాబయ్ సారధ్యంలో జరుగుతున్న ఈ వేదికపై అబ్బాయ్ గురించి ఈ స్థాయిలో ప్రసంగించేసరికి... కార్యకర్తలు, జనాలు అంతా చూస్తున్నారన్న విషయం పట్టించుకోని బాబాయ్‌ శివ్‌ పాల్‌.. అబిదీని ప్రసంగం మధ్యలోనే అడ్డుకున్నారు. అతనిని బలవంతంగా మైక్‌ ముందునుంచి అవతలకు గెంటేశారు. దీంతో సభ వేదికపై ఒకింత గందరగోళం నెలకొంది. దీంతో అఖిలేశ్‌ మద్దతుదారుడికి ఈ విధంగా చేదు అనుభవం ఎదురయ్యింది.

ఇలా బహిరంగంగానే ఇలా వేదికపై శివ్ పాల్ ప్రవర్తించడం యూపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఎవరు అవునన్నా కాదన్నా సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత విభేదాలు ఏస్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్ధం అవుతుంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/