Begin typing your search above and press return to search.

అబ్బాయి బాబాయ్ ల మధ్య చిచ్చుకు యోగీ స్కెచ్...?

By:  Tupaki Desk   |   3 April 2022 11:30 PM GMT
అబ్బాయి బాబాయ్ ల మధ్య చిచ్చుకు యోగీ స్కెచ్...?
X
రాజకీయాలలో బంధాలకు విలువ లేదు అంటారు. అవి చాలా పలచగా ఉంటాయని కూడా చెబుతారు. ఏ బంధం అయినా అక్కడ పుటుక్కున తెగిపోవాల్సిందే. ఇక సమాజ్ వాదీ పార్టీ చీఫ్ గా ములాయం సింగ్ యాదవ్ ఉన్నపుడు టోటల్ గా పార్టీని భుజాన వేసుకుని యూపీలో చక్రం తిప్పింది శివపాల్ యాదవ్. ఆయన ఎవరో కాదు, ములాయంకి స్వయాన తమ్ముడు, ఎస్పీ ప్రస్తుత చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కి బాబాయ్.

ఇక అఖిలేష్ 2012 లో సీఎం అయ్యాక బాబాయ్ అబ్బాయ్ ల మధ్యల వివాదాలు ముదిరాయి. పార్టీని బాబాయ్ పట్టు నుంచి అబ్బాయ్ తన వైపునకు ఒక్క లెక్కన లాగేసుకున్నారు. మరి దశాబ్దాల పాటు ఎస్పీ గుట్టు మట్ట్లు తెలిసిన బాబాయ్ ఊరుకుంటారా. ఆయన కూడా వేరే పార్టీ పెట్టుకున్నారు. ఈ వైరం 2017 ఎన్నికల్లో ఎస్పీని బాగా దెబ్బతీసింది.

ఇక 2022 నాటికి ఈ ఇద్దరూ కలిశారు. అయినా ఎస్పీకి సీట్లు పెరిగాయి కానీ ఓడిపోయాయి. మరోమారు బీజేపీ పవర్ లోకి వచ్చింది. దీంతో మళ్లీ బాబాయ్ అబ్బాయ్ ల మధ్య లుకలుకలు మొదలయ్యాయని అంటున్నారు. సరిగా ఈ చాన్స్ ని బీజేపీ తనకు అనుకూలంగా తీసుకుంటోంది. అఖిలేష్ ని దెబ్బ తీయాలీ అంటే బాబాయ్ ని దగ్గరకు తీసుకోవాలని చూస్తోంది.

అంతే అర్జంటుగా యూపీ సీఎం యోగీ మాస్టార్ ఫీల్డ్ లోకి దిగిపోయారు. శివపాల్ యాదవ్ ని ఇపుడు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ చేయాలని చూస్తున్నారు. దీనికి శివపాల్ నుంచి కూడా సానుకూలత వ్యక్తం అవుతోందిట. మొత్తానికి చూస్తే అబ్బాయ్ బాబాయ్ ల మధ్య లడాయి యూపీలో బీజేపీకి వరంగా మారుతోంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే స్కెచ్ గీస్తున్న బీజేపీ అఖిలేష్ సైకిల్ కి గాలి తీయాలని చూస్తోంది. మరి అబ్బాయి దీన్ని ఎలా తట్టుకుంటాడో చూడాలి.