Begin typing your search above and press return to search.

ఏపీలో ఉద్యమం చేస్తానంటున్న సినీ హీరో

By:  Tupaki Desk   |   9 May 2016 3:40 PM IST
ఏపీలో ఉద్యమం చేస్తానంటున్న సినీ హీరో
X
రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలంటూ మోడీ సర్కారును పదే పదే విన్నపాలు చేయటంతో పాటు.. ఏపీ జరిగిన నష్టాన్ని భర్తీ చేసే విషయంలో పలుమార్లు గళం విప్పిన సినీ హీరో శివాజీ మరోసారి తన గళం విప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అనంతపురంలో సాగుతున్న రిలే నిరాహారదీక్షలకు సంఘీభావం తెలిపిందుకు అనంతపురానికి వచ్చారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ఏపీ నుంచి ప్రకృతి వనరులు తరలించుకుపోతున్న కేంద్రం.. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విమర్శను చేశారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని అమలు చేయటం లేదని మండిపడ్డ శివాజీ.. ప్రత్యేక హోదా కోసం ఏపీలోని 13 జిల్లాల్లో ఉద్యమం చేస్తానని ప్రకటించారు.

అధికారంలోకి వచ్చేలా సహకరించిన ఏపీ ప్రజల్ని మోసం చేస్తారా? అంటూ ప్రశ్నించిన శివాజీ.. మరో కీలక వ్యాఖ్య చేశారు. బీజేపీని అధికారంలోకి వచ్చేలా చేసిన ప్రముఖ నేత అద్వానీని పక్కన పెట్టిన బీజేపీ ఏపీని పట్టించుకుంటుందా? అన్నసందేహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు రోడ్ల మీదకు వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఊహించుకోవచ్చని.. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దంటూ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. బీజేపీని నమ్మొద్దంటున్న శివాజీ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ఉద్యమాన్ని చేపడతారో చూడాలి.