Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు పదవీ గండం తప్పదా?

By:  Tupaki Desk   |   4 July 2016 7:05 AM GMT
చంద్రబాబుకు పదవీ గండం తప్పదా?
X
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని ప్రధాన నగరం విజయవాడలో విస్తరణ పనుల నేపథ్యంలో పలు ఆలయాలను కూల్చివేయడంతో రచ్చరచ్చ జరుగుతోంది. ఆలయాల కూల్చివేత చంద్రబాబు పదవికి ఎసరు తెస్తుందని పండితులు అంటున్నారు. సుమారు 40 ఆలయాలను చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేయించడంపై హిందూపీఠాధిపతులు మండిపడుతున్నారు. ఎన్నో పురాతన ఆలయాలను చంద్రబాబు కూల్చివేయించారని.. దేవుళ్ల ఆగ్రహాన్ని ఆయన చవిచూడాల్సివస్తుందని శపిస్తున్నారు. 1903నాటి ఆంజనేయుడి విగ్రహం కూల్చివేయడం ఏమిటని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి మండిపడ్డారు. అర్జునుడి కాలం నాటి వినాయకుడి విగ్రహం కూల్చివేయడం కూడా అపచారమన్నారు.

ఇవన్నీ ఒకెత్తయితే చంద్రబాబు అంతకంటే తీవ్రమైన తప్పిదం చేశారని శివస్వామి చెబుతున్నారు. రాహు - కేతువుల ఆలయాలను కూడా కూల్చివేశారని ఆవేదన చెందిన ఆయన.... రాహుకేతువులతో పెట్టుకున్నవారెవరూ నష్టపోకుండా ఉండరని.. చంద్రబాబుకు కూడా ఆ ప్రభావం తప్పదని చెబుతున్నారు. రాహుకేతువుల ఆలయాల కూల్చివేత చంద్రబాబు ప్రభుత్వానికే గండమని శివస్వామి అభిప్రాయపడ్డారు. ఆలయాల కూల్చివేతకు నిరసనగా సోమవారం విజయవాడలో భారీర్యాలీ నిర్వహిస్తామన్నారు.

అంతేకాకుండా ఆయన చంద్రబాబును ఘజనీ - ఘోరీ వంటి ముస్లిం పాలకులతోనూ పోల్చారు. పూర్వకాలం మహ్మదీయ రాజులు దేశంపై దండెత్తి వేల ఆలయాలను నేలమట్టం చేశారని… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే పనిచేసిందన్నారు. ఎవరికీ చెప్పకుండా ఆర్థరాత్రి ఆలయాలను కూల్చివేశారని... మద్యం తాగి వచ్చిన వందలాది మంది ఆలయాల్లో ప్రవేశించడమే అపచారమైతే.. వాటిని కూల్చివేయడం ఇంకా అపచారమని ఆయన ఆవేదన చెందారు. దేవుళ్లపై దండయాత్ర చేసిన చంద్రబాబు ఫలితం అనుభవించక తప్పదని అన్నారు.