Begin typing your search above and press return to search.

ఐదేళ్లూ కలిసుంటామని ఇప్పుడే చెప్పలేం!

By:  Tupaki Desk   |   22 May 2018 12:25 PM GMT
ఐదేళ్లూ కలిసుంటామని ఇప్పుడే చెప్పలేం!
X
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అత్యంత ధ‌నికుడైన ప్ర‌జాప్ర‌తినిధిగా పేరొందిన శివ‌కుమార్ కాంగ్రెస్ క్యాంప్‌ న‌కు చెందిన ఎమ్మెల్యేలకు ``త‌గిన ఏర్పాట్లు`` చేసి ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చేలా వ్యూహాలు ప‌న్నిన సంగ‌తి తెలిసిందే. త‌న అఫిడ‌విట్లోనే రూ.730 కోట్ల ఆస్తుల‌ను చూపించిన శివ‌కుమార్ త‌ద్వారా ఆర్థికంగా బ‌ల‌మైన నాయ‌కుడిగా గుర్తింపును పొందిన శివ‌కుమార్ అదే రీతిలో బీజేపీ ఎత్తుల‌కు చిక్క‌కుండా కాంగ్రెస్ క్యాంపును న‌డిపించ‌డంలో స‌క్సెస్ అయ్యారు. అలా కాంగ్రెస్‌-జేడీఎస్ అధికారానికి చేరువ అయ్యేందుకు కార‌ణ‌మైన శివ‌కుమార్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈనెల 23వ తేదీన కాంగ్రెస్ జేడీఎస్ కూట‌మి ర‌థ‌సార‌థిగా కుమారస్వామి ప్ర‌మాణ స్వీకారం బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న నేప‌థ్యంలో ట్ర‌బుల్ సూట‌ర్ అయ‌న శికుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 30 ఏళ్లుగా తాను పోరాడుతున్న జేడీఎస్‌తోనే చేతులు కలపడం ఇబ్బందిగానే ఉందని అన్నారు. ``1985 నుంచి గౌడలతో పోరాడుతున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో దేవెగౌడ చేతుల్లో ఓడిపోయాను. ఆయన కుమారుడు, కోడలిపై మాత్రం గెలిచాను. చాలా రాజకీయాలు నడిచాయి. ఎన్నో కేసులను నేను ఎదుర్కొన్నా. కానీ పార్టీ, దేశ ప్రయోజనాల కోసం జేడీఎస్‌తో చేతులు కలపక తప్పని పరిస్థితి. ఇది రాహుల్‌గాంధీ నిర్ణయం`` అని శివకుమార్ అనడం గమనార్హం. ఒక్కోసారి వ్యక్తిగత నిర్ణయాలకు విలువుండదని, సంయుక్తంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సిందేనని ఆయన వేదాంత దోర‌ణిలో మాట్లాడారు.

కేబినెట్ స్వరూపం అన్నది ఆలిండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయమే అని డీకే శివ‌కుమార్ స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం ఐదేళ్లూ ఉంటుందా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. ``సమయమే దానికి సమాధానం చెబుతుంది. ఇప్పుడే దానిపై స్పందించలేను. మా ముందు చాలా అంశాలు, అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పలేను`` అని శివకుమార్ వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తన అంగీకారం కూడా తెలిపానని స్పష్టంచేశారు. కాగా, జేడీఎస్‌తో కాంగ్రెస్ పొత్తు అనేది 2019 ఎన్నికలకు ముందు ఏర్పడబోయే మహా కూటమికి తొలి మెట్టు అని శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నేత ఇలా న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.