Begin typing your search above and press return to search.

ఇక.. పాత మిత్రుడు కాదు.. కొత్త ప్రత్యర్థి

By:  Tupaki Desk   |   23 Oct 2016 5:00 AM GMT
ఇక.. పాత మిత్రుడు కాదు.. కొత్త ప్రత్యర్థి
X
రాజకీయాల్లో శాశ్విత మిత్రుడు.. శాశ్విత శత్రువు అనే వాళ్లుఎవరూ ఉండరని.. అవసరం ఎలాంటి వారినైనా..ఎంతకైనా మార్చేస్తుందని బలంగా నమ్ముతుంటారు. దీనికి తగ్గట్లే రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. అప్పటివరకూ బండబూతులు తిట్టుకునే నేతలు.. ఆ వెంటనే భుజం.. భుజం రాసుకుపూసుకు తిరిగే వైనం రాజకీయాల్లో మాత్రమే కనిపిస్తుంది. అంతేనా.. అప్పటివరకూ తానున్న పార్టీకి ప్రాణాలు ఇచ్చేందుకైనా తాము సిద్ధమేనని చెప్పే నేతలు.. పార్టీ నుంచి జంప్ అయ్యే ఉదంతాలు ఎన్నో. ఇవన్ని ఒక ఎత్తు అయితే..నమ్మకమైన మిత్రుడ్ని.. కేవలం తమ చేష్టల ద్వారా పోగొట్టుకునే వైనం మాత్రం బీజేపీలో మాత్రమే కనిపిస్తుంది. బీజేపీతో జత కట్టేందుకు దేశంలోని రాజకీయ పార్టీలు వెనకడుగు వేసే వేళ.. తాము బీజేపీ వెనుకే ఉంటామని చెప్పటమే కాదు.. బీజేపీకి దన్నుగా నిలిచిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది.. శివసేన మాత్రమే.

బీజేపీకి అత్యంత నమ్మకమైన మిత్రపక్షంగా శివసేనను అభివర్ణించొచ్చు. కానీ.. బీజేపీలో మోడీ పాత్ర పెరుగుతున్న కొద్దీ.. ఈ మిత్రుడి పాత్ర తగ్గిపోతున్న పరిస్థితి. దీనికి తోడు.. మహారాష్ట్రలో ఆ మధ్యజరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈ రెండు పార్టీల మధ్య దూరాన్ని భారీగానే పెంచేశాయి. దీని కారణంతోనే ఎప్పుడూ లేని విధంగా బీజేపీని తప్పు పడుతూ శివసేన వ్యాఖ్యలుచేసే పరిస్థితి.

ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న వేళ.. తాజాగా చోటు చేసుకున్నపరిణామం బీజేపీకి షాక్ తినేలా చేస్తుందనటంలో సందేహం లేదు. నిన్నటి వరకూ నమ్మకస్తుడైన మిత్రపక్షంగా ఉన్న శివసేన.. తన సత్తా చాటుకోవాలని.. తన పరిధిని పెంచుకోవాలని భావిస్తున్న విషయం తాజా నిర్ణయంతో అర్థమవుతుంది. బీజేపీకి పొలిటికల్ ఐడియాలజీని అందించే ఆర్ ఎస్ ఎస్ కు చెందిన సుభాష్ వెలింకర్ ను బహిష్కరించారు. దీంతో ఆయన.. ‘గోవా సురక్షా మంచ్’ అంటూ కొత్త కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా శివసేన.. సదరు మంచ్ తో చెట్టాపట్టాలేసుకోవాలని నిర్ణయించటం రాజకీయంగా కలకలం రేపుతోంది.

త్వరలో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన.. వెలింగ్ కర్ తో కలిసి నడవాలని నిర్ణయించింది. దీంతో.. నిన్నటి వరకూ మిత్రపక్షంగా ఉన్న నేతలతోనే.. నేడు సై అంటే సై అన్నట్లుగా పోటీకి దిగాల్సి ఉంటుంది. గతంలో గోవా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మనోహర్ పారికర్ కు ప్రమోషన్ ఇస్తూ.. కేంద్ర రక్షణ మంత్రిగా నియమించిన తర్వాత.. గోవాలో బీజేపీకి ప్రజాకర్షక నేత అంటూ ఎవరూ లేని పరిస్థితి (మనోహర్ పారికర్ స్థాయితో పోల్చినప్పుడు). దీంతో.. ఆ పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతోంది. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా వెలింగ్ కర్ తో శివసేన జత కట్టి పోటీకి దిగుతానని చెప్పటం ఆ పార్టీకి భారీ షాక్ అని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/