Begin typing your search above and press return to search.

రిటైర్డ్ నావికాదళ అధికారిపై శివసేన కార్యకర్తల దాడి !

By:  Tupaki Desk   |   12 Sept 2020 6:00 PM IST
రిటైర్డ్ నావికాదళ అధికారిపై శివసేన కార్యకర్తల దాడి !
X
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను అపహాస్యం చేస్తూ ఓ కార్టూన్ ఫార్వార్డ్ చేసినందుకు రిటైర్డ్ నావికాదళ అధికారిపై శివసేన కార్యకర్తలు దాడికి దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... మదన్‌ శర్మ అనే 65 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగి ముంబైలోని కండివలి ఈస్ట్ ‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు వాట్సప్‌ లో వచ్చిన ఠాక్రే కు సంబంధించిన ఓ కార్టూన్ ‌ను మదన్‌ తమ‌ రెసిడెన్షియల్‌ సొసైటీ గ్రూప్ ‌లో షేర్ చేశాడు. ఆ తర్వాత అతనికి కమలేష్‌ కదమ్‌ అనే వ్యక్తి కాల్‌ చేసి తన పేరు, ఇంటి చిరునామా అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం మదన్‌ ను ఇంటి బయటకు పిలిచి కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేసింది.

దాడి చేస్తున్న వీడియోలు సమీప సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో ఇంటి నుంచి బయటకు వస్తున్న మదన్‌ దాదాపు ఎనిమిది మందితో కూడిన శివసేన కార్యకర్తల బృందం వెంబడించింది. భయంతో లోపలికి పరుగెత్తుతున్న మదన్‌ ను చొక్కా పట్టుకొని, దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మదన్‌ ముఖం మీద గాయాలవ్వగా, కన్ను రక్తంతో మొత్తం తడిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటం తో బీజేపీ వర్గాలు శివసేన ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసి రెచ్చిపోయిన శివసేన ఇప్పుడు రిటైర్డ్ అధికారిపై దాడికి తెగబడిందని బీజేపీ ఆరోపణలు చేసింది.

ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తో సహా పలువురు బీజేపీ నాయకులు గాయపడిన మదన్ శర్మ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా విచారకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన. రిటైర్డ్ నావీ ఆఫీసర్ కేవలం వాట్సప్ ఫార్వార్డ్ చేసిన కారణంగా గూండాల దాడిలో గాయపడ్డారు. దయచేసి, ఇలాంటివి ఆపండి ఉద్దవ్ ఠాక్రే జీ. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము’ అని ట్వీట్‌ చేశారు.