Begin typing your search above and press return to search.

గాడ్ పాలిటిక్స్: షిర్డీ సాయితో పెట్టుకున్న ఉద్దవ్.. కథేంటి?

By:  Tupaki Desk   |   18 Jan 2020 8:28 AM GMT
గాడ్ పాలిటిక్స్: షిర్డీ సాయితో పెట్టుకున్న ఉద్దవ్.. కథేంటి?
X
తిరుమల వేంకటేశ్వరుడు కూడా ఆ ఏడుకొండలపైనే పుట్టలేదు. కానీ అక్కడి వచ్చి వెలిసి కలియుగ దేవుడయ్యాడు. అలా అని ఆయన పుట్టిన చోటునే ప్రజలు పూజిస్తున్నారా అంటే అదేం లేదు కదా.. కానీ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ఇప్పుడు అదే ఆలోచన వచ్చింది. కలియుగ దైవమైన షిర్డీ సాయిబాబా పుట్టిక మీద డౌట్ వచ్చింది. దాని మీద ఇప్పుడు వివాదాన్ని రాజేశారు.

ఇన్నాళ్లు దేశ ప్రజలంతా అయోధ్యలో రామజన్మభూమి వివాదంతో నలిగిపోయారు. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కొత్త లౌకిక వాద ఫిలాసఫీ కారణంగా షిర్డీ సాయిబాబాతో పెట్టుకున్నాడు. ఆయన జన్మస్థలంపై వివాదం రాజేసి అగ్నికి ఆజ్యం పోశాడు. శివసేన అధిపతి ఉద్దవ్ ఠాక్రే కారణంగా షిర్డీ వివాదం తెరపైకి వచ్చింది.

*అసలు వివాదం ఏంటి?

షిర్డీ సాయిబాబా పుట్టింది పాథ్రీ అనే గ్రామమంటూ మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.100కోట్లు కేటాయించడం కొత్త వివాదానికి దారితీసింది.. సాయిబాబా కొలువైన షిర్డీ సంస్థాన ట్రస్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయిబాబా కొలువైన షిర్డీని కాకుండా పాథ్రీని అభివృద్ధి చేస్తామన్న శివసేన సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా షిర్డీ ఆలయాన్ని రేపటి నుంచి మూసివేసేందుకు నిర్ణయించింది. ఇది దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ వైఖరి కారణంగా షిర్డీ సాయి పుట్టిక కూడా వివాదంగా మారిపోయింది.

*షిర్డీ సాయి ఎక్కడ పుట్టాడు?

ఇన్నాళ్లు సాయి బాబా అంటే షిర్డీనే.. అదే సాయిబాబా జన్మస్థలంగా భావిస్తూ షిర్డీలోనే అందరూ మొక్కుతుంటారు. దేశవ్యాప్తంగా భక్తులు వచ్చి కొలుస్తుంటారు. ఆలయాన్ని నిర్మించారు. కానీ మహారాష్ట్రలో కొలువైన శివసేన ప్రభుత్వం తమ మార్క్ చూపించేందుకు సాయిబాబా జన్మస్థలాన్ని వివాదంలోకి లాగింది. సాయిబాబా జన్మస్థలం పర్భణీ జిల్లాకు చెందిన పాథ్రీ గ్రామం అంటూ షిర్డీని వదిలేసి దాన్ని అభివృద్ధి చేయడానికి 100 కోట్లు కేటాయించడం వివాదాస్పదమైంది. 1999లో సాయిబాబా జన్మ స్థాన్ అయిన పాథ్రీ గ్రామంలో ‘శ్రీసాయి జన్మస్థాన్’ మందిరాన్ని నిర్మించారు. వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తుండడంతో దాని అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. ఇదే ఇప్పుడు వివాదమైంది. ఇన్నాళ్లు లేని సాయిబాబా జన్మభూమి అంశం ఇప్పుడే శివసేన ప్రభుత్వం తీసుకురావడంపై ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని షిర్డీ వాసులు ప్రకటించారు. రేపటి నుంచి షిర్డీ ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తున్నట్లు షిర్డీ సంస్థాన్ ప్రకటించడం దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆందోళనకు కారణమైంది.

సాయిబాబా పుట్టింది పాథ్రీయే అనేందుకు ఆధారాలు ఉన్నాయని ఎన్సీపీ ఎమ్మెల్యే దుర్రాని అబ్దుల్లా తెలిపారు. పాథ్రీకి ప్రాధాన్యం ఇస్తే తమ క్షేత్ర ప్రాధాన్య తగ్గుతుందని షిర్డీ వాసులు పోరుబాట పట్టారు. ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది.

*శివసేనకు కాంగ్రెస్ - ఎన్సీపీ మద్దతు

శివసేన ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంలో లౌకిక పార్టీలైన కాంగ్రెస్ - ఎన్సీపీ లు భాగం. ఈ రెండు పార్టీలు కలిశాక మతతత్వంతో హిందుత్వవాదంతో చెలరేగిపోయిన శివసేన పూర్తిగా తన స్టాండ్ మార్చుకుంది. బీజేపీ తెచ్చిన ‘పౌరసత్వ చట్టాన్ని కూడా వ్యతిరేకించింది. ఇప్పుడు షిర్డీ సాయి బాబా జన్మస్థలం వివాదం తెచ్చి భక్తుల మనోభావాలతో సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆడుకుంటున్నారు.

*ఫాథ్రే ప్రకటన వెనుక ఎన్సీపీ

పర్భణి జిల్లా ఎన్సీపీకి పెట్టని కోట.. మహారాష్ట్ర సర్కారులో ఎన్సీపీ శరద్ పవార్ కీరోల్. అందుకే పర్భణి జిల్లాలోని పాథ్రి సాయి బాబా జన్మస్థలమంటూ అక్కడ 100 కోట్లను ఎన్సీపీ కేటాయించుకుంది. అయితే దేవుడితో ఆటలాగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే షిర్డీని వదిలేసి పాథ్రికి 100 కోట్లు కేటాయించడం వివాదాస్పదమైంది. ఎన్సీపీ ఆడినట్టు ఉద్ధవ్ ఠాక్రే ఆడుతూ ఇప్పుడు సాయి బాబా జన్మస్థలంపై లేనిపోని వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా భక్తులు కొలిచే షిర్డీ సాయి బాబా ఆలయ ప్రాముఖ్యతను తగ్గించేందుకు ఎన్సీపీ ఆడుతున్న ఆటలో ఉద్దమ్ ఠాక్రే అరటిపండుగా మారారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

స్వయానా హిందుత్వవాదిగా మొన్నటి వరకు ఉన్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ - ఎన్సీపీ మాయలో పడిపోయి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా షిర్డీ సాయిబాబాతో వివాదాలు రాజేయడంపై బీజేపీ - సాయి భక్తులు మండిపడుతున్నారు. సాయి బాబా పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. హిందుత్వవాదంతో పుట్టి.. ప్రాంతీయ వాదంతో ఎదిగిన శివసేన అధినేత ఉద్దవ్ ఇలా దేవుడితో పెట్టుకోవడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.