Begin typing your search above and press return to search.

షిర‌హ‌ట్టిలో ఎవ‌రు గెలిస్తే వారిదే క‌ర్ణాట‌క పీఠం

By:  Tupaki Desk   |   12 May 2018 5:41 AM GMT
షిర‌హ‌ట్టిలో ఎవ‌రు గెలిస్తే వారిదే క‌ర్ణాట‌క పీఠం
X
మిగిలిన రంగాల్లో సెంటిమెంట్లు ఎలానో రాజ‌కీయాల్లోనూ భారీగానే క‌నిపిస్తుంటాయి. అయితే.. సెంటిమెంట్లు ఏదో గుడ్డిగా కాకుండా ఒక లాజిక్ ను బేస్ చేసుకొని ఉంటాయి. తాజాగా అలాంటిదే ఒక‌టి ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చింది. క‌ర్ణాట‌క పీఠాన్ని సొంతం చేసుకోవ‌టానికి కాంగ్రెస్‌.. బీజేపీలు పోటాపోటీ ప‌డుతున్న వైనం తెలిసిందే. ఎలా అయినా స‌రే.. క‌ర్ణాట‌కలో అధికారాన్ని చేజిక్కించుకోవ‌టమే ప్ర‌ధాన పార్టీల ల‌క్ష్యంగా మారింది.

దీంతో.. ఏ చిన్న అవ‌కాశాన్ని మిస్ చేసుకోకుండా గెలుపు కోసం పార్టీలు కిందా మీదా ప‌డుతున్నాయి. ఇలాంటివేళ ఆస‌క్తిక‌ర సెంటిమెంట్ ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. క‌ర్ణాట‌క‌లోని షిర‌హ‌ట్టి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ పార్టీనే క‌ర్ణాట‌క రాష్ట్ర అధికారాన్ని కైవ‌శం చేసుకోవ‌టం ఒక సంప్ర‌దాయంగా వ‌స్తోంది. 1972 నుంచి గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కూ ఇదే సెంటిమెంట్ న‌డిచింది. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఈ సెంటిమెంట్ కొన‌సాగుతుందా? బ్రేక్ ప‌డుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమిటంటే.. ఎప్పుడైనా ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు ఓట‌మి పాలై.. ఇండిపెండెంట్ అభ్య‌ర్థి గెలిస్తే.. అత‌డు ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తే.. ఆ పార్టీదే అధికార దండం అన్న సెంటిమెంట్ సాగుతోంది.క‌ర్ణాట‌క రాష్ట్రం మొత్తంగా 224 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌లు 222 స్థానాల్లో మాత్ర‌మే పోలింగ్ సాగుతోంది. ఇదిలా ఉంటే.. షిర‌హ‌ట్టిలో గెలుపు ఎవ‌రిద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ముంబ‌యి క‌ర్ణాట‌క‌లోని గ‌దగ్ జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గ‌మే షిర‌హ‌ట్టి. దాదాపు 2 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నారు. 2013 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 71.8 శాతం పోలింగ్ న‌మోదైంది. మ‌త‌సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా షిర‌హ‌ట్టి నిలుస్తోంది. హిందూ.. ముస్లింలు ఇద్ద‌రూ ఆరాధించే శ్రీ‌జ‌గ‌ద్గురు ఫ‌కిరీశ్వ‌ర మ‌ఠం ఇక్క‌డే ఉంది. 450 ఏళ్లుగా ఇదే సంప్ర‌దాయం ఇక్క‌డ కంటిన్యూ అవుతోంది.

ఈ మ‌ఠం ప్ర‌త్యేక‌త ఏమిటంటే మ‌ఠం ప్ర‌ధాన పూజారి సూఫీ భ‌క్తి మార్గాన్ని బోధిస్తారు. ఒక‌వేళ ప్ర‌ధాన పూజారి మ‌ర‌ణించిన ప‌క్షంలో అత‌డ్ని హిందు.. ఇస్లామ్ ప‌ద్ద‌తుల్లో అంతిమ సంస్కారాలు ఆచ‌రిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక్క‌డి ఓట‌ర్ల‌లో 20-29 ఏళ్లలోపు ఉన్న ఓట‌ర్లు 31 శాతం మంది ఉంటే.. 30-39 ఏళ్ల మ‌ధ్య ఉన్న ఓట‌ర్ల 32 శాతం మేర ఉండ‌టం గ‌మ‌నార్హం. 1972 నుంచి 2013 వ‌ర‌కు ఏ పార్టీ అభ్య‌ర్థి ఇక్క‌డ గెలిస్తే.. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికార‌ప‌క్షంగా అవ‌త‌రించ‌టం ఒక అల‌వాటుగా మారింది. అంతేకాదు.. ఒక‌వేళ ఇండిపెండెంట్ గెలిస్తే.. ఆ నేత ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ అధికార పార్టీగా అవ‌త‌రించ‌టం విశేషం. మ‌రి.. ఈసారి ఈ సెంటిమెంట్ ఎంత‌మేర వ‌ర్క్ వుట్ అవుతుందో చూడాలి.