Begin typing your search above and press return to search.

టీడీపీ గెలుపుపై శిల్పా పంచ్ పేలిందే!

By:  Tupaki Desk   |   28 Aug 2017 8:16 AM GMT
టీడీపీ గెలుపుపై శిల్పా పంచ్ పేలిందే!
X

క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉత్కంఠ‌భ‌రిత‌మైన ఎన్నిక‌లో అధికార టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి విజ‌యం సాధించారు. ఈ నెల 23న జ‌రిగిన పోలింగ్‌కు సంబంధించి నేటి ఉద‌యం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా... ప్ర‌తి రౌండ్‌లోనూ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించిన టీడీపీ... ఒకే ఒక్క రౌండ్‌ లో వెనుక‌బ‌డింది. ఈ క్ర‌మంలో ఆ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి 16వ రౌండ్ పూర్తి కావ‌డంతోనే సాంకేతికంగా విజ‌యం సాధించేశారు. ఓట్ల లెక్కింపును ప‌రిశీలించేందుకు కౌంటింగ్ కేంద్రానికి స్వ‌యంగా హాజ‌రైన వైసీపీ అభ్యర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి... ఏడో రౌండ్ ముగియ‌గానే ప‌రిస్థితి అర్థ‌మై బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అక్క‌డే మీడియాతో మాట్లాడుతూ త‌న ఓట‌మిపై స్పందించారు.

తాను ఓట‌మి పాలు కావ‌డానికి టీడీపీ వెద‌జ‌ల్లిన డ‌బ్బే ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింద‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. డ‌బ్బు పంపిణీ కార‌ణంగానే టీడీపీ విజ‌యం సాధిస్తోంద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. అయితే ప్ర‌జ‌లిచ్చిన తీర్పును తాను గౌర‌విస్తాన‌ని చెప్పిన శిల్పా... డ‌బ్బు పంపిణీతో సాధించిన విజ‌యం కూడా ఓ గెలుపేనా అని కూడా టీడీపీపై మండిప‌డ్డారు. అధికారంలో ఉన్న టీడీపీ ఈ ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప‌రిగ‌ణించి డ‌బ్బు మూట‌ల‌ను కుమ్మ‌రించింద‌ని ఆరోపించారు. అంతేకాకుండా దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి చ‌నిపోయిన నేప‌థ్యంలో టీడీపీ అభ్యర్థి విజ‌యానికి కాస్తంత సానుభూతి కూడా ప‌నిచేసింద‌ని చెప్పారు.

అంతేకాకుండా కేవ‌లం ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించే ఉద్దేశ్యంతోనే మూడేళ్ల‌కు పైగా నంద్యాల అభివృద్ధిపై దృష్టి సారించ‌ని చంద్ర‌బాబు... ఎన్నిక‌ల ముందుగా నంద్యాల‌కు వంద‌ల కోట్ల నిధుల‌ను విడుద‌ల చేశార‌ని, ఇది కూడా టీడీపీ గెలుపున‌కు ఉప‌యోగ‌ప‌డింద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. మొత్తంగా నంద్యాల‌లో టీడీపీ గెలుపు... కేవ‌లం డ‌బ్బు వెద‌జ‌ల్ల‌డంతోనే సాధ్య‌మైంద‌ని చెప్పాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న తేల్చేశారు. ఇక ఎన్నిక‌ల సంద‌ర్భంగా మంత్రి అఖిల‌ప్రియ‌ - శిల్పాల మ‌ధ్య కొన‌సాగిన స‌వాళ్ల‌పై స్పందించిన శిల్పా... రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌న్న స‌వాల్‌ కు అఖిల నుంచి స‌మాధానం రానందున తాను ఆ ఆ స‌వాల్‌ ను స్వీక‌రించ‌డం లేద‌ని తేల్చిచెప్పారు. ఏదేమైనా ప్ర‌జ‌ల తీర్పును శిర‌సావ‌హిస్తాన‌ని శిల్పా చెప్పుకొచ్చారు.