Begin typing your search above and press return to search.

శిల్పా భ‌రోసా!.. బెదిరింపుల‌కు భ‌య‌ప‌డొద్దు!

By:  Tupaki Desk   |   22 Aug 2017 4:18 AM GMT
శిల్పా భ‌రోసా!.. బెదిరింపుల‌కు భ‌య‌ప‌డొద్దు!
X
ప్ర‌లోభాలు.. లొంగ‌క‌పోతే బెదిరింపులు!! త‌మ‌కే అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఒత్తిళ్లు.. అంత‌కీ త‌మ వైపు రాక‌పోతే పోలీసు కేసులు సొంత వ్యాపారాలు - బంధువుల ఇళ్ల‌పై చేతిలో ఉన్న పోలీసుల సాయంతో సోదాలు!! ఇదీ నంద్యాల ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఓట‌మి భ‌యంతో ర‌గిలిపోతున్న టీడీపీ నేత‌లు.. బెదిరింపులు - దౌర్జ‌న్యాల‌కు దిగుతున్నారట‌. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి ప్ర‌చారం వైసీపీ శ్రేణుల్లో స‌రికొత్త ఉత్తేజం నింపింది. వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న‌రెడ్డి విజ‌యంపై శ్రేణులు ధీమాగా ఉన్నాయట‌. వీటిని దెబ్బ‌తీసేందుకు తెలుగుదేశం నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాని వ‌దంతులు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ బెదిరింపుల‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని శిల్పా మోహ‌న‌రెడ్డి భ‌రోసా ఇచ్చారు. అభివృద్ధి అంటూ టీడీపీ చేస్తున్న ప్ర‌చారాన్ని ఆయ‌న‌ స‌మ‌ర్థంగా తిప్పికొట్టారు.

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరి రోజు గాంధీ చౌక్‌ లో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్వహించిన రోడ్‌ షోలో శిల్పా మోహన్‌ రెడ్డి ప్రసంగించారు. చంద్రబాబు ఇళ్లు కట్టిస్తామన్న మాట పచ్చి అబద్ధమని శిల్పా తెలిపారు. భూమా నాగిరెడ్డి బతికున్న సమయంలో పదివేల ఇండ్లు ఫ్రీగా కట్టిస్తామని చెప్పారని, కానీ నాడు డబ్బులు అడిగితే... చంద్రబాబు ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేక పోయిందని వివ‌రించారు. వైఎస్‌ జగన్‌ సీఎం కావటం ఖాయమని, ఆయన అధికారంలోకి రాగానే మూడు సెంట్ల స్థలం - ఉచిత ఇళ్లు మంజూరు చేస్తామని శిల్పా హామీ ఇచ్చారు. ఓట్లు వేయకపోతే రేషన్‌ కార్డులు తొలగిస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని, ఒక్క రేషన్‌​ కార్డు పోనివ్వకుండా చూసుకునే బాధ్యత తమదేనని ఆయన తెలిపారు.

అభివృద్ధి అంటే బిల్డింగ్‌ లు కూలగొట్టడం - రోడ్లు వేయటం కాదని.... పరిశ్రమలు - విద్యాలయాలు రావాల్సిన అవసరం ఉందని శిల్పా అభిప్రాయపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణానికి తాగునీటి ఇబ్బంది లేకుండా చూసుకున్నానని, శిల్పా కేబుల్‌ పేరిట తక్కువ నగదుకే కేబుల్‌ సదుపాయాన్ని కల్పించానని ఆయన పేర్కొన్నారు. `మీకు ఆళ్లగడ్డ రాజకీయాలు కావాలో? నంద్యాల రాజకీయాలు కావాలో` నిర్ణయించుకోవాలని శిల్పా ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.