Begin typing your search above and press return to search.

నంద్యాల గెలుపును..జ‌గ‌న్‌ కు కానుక‌గా ఇస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   6 July 2017 4:06 AM GMT
నంద్యాల గెలుపును..జ‌గ‌న్‌ కు కానుక‌గా ఇస్తార‌ట‌!
X

క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉపఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ ఇంకా వెలువ‌డ‌కున్నా... అక్క‌డ మాత్రం ప‌రిస్థితి నానాటికీ వేడెక్కుతోంది. అధికార పార్టీ టీడీపీ త‌న‌దైన మంత్రాంగంతో త‌ట‌స్థంగా ఉన్న కొంద‌రు నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకుంటుండ‌గా... అందుకు ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తున్న విప‌క్ష వైసీపీ ఏకంగా టీడీపీలోనే కొన‌సాగుతున్న నేత‌లు - కార్య‌క‌ర్త‌ల‌ను ఆక‌ర్షించే విధంగా వినూత్న పంథాతో ముందుకు పోతోంది. వెర‌సి అక్క‌డ రోజురోజుకూ ఇరు పార్టీల మ‌ధ్య పోటీ హోరాహోరీగా మారుతోంది. దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి గుండెపోటు కార‌ణంగా హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌గా... నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే.

ఈ ఎన్నిక‌లో అధికార టీడీపీ భూమా నాగిరెడ్డి సోద‌రుడు శేఖ‌ర్ రెడ్డి కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని బ‌రిలోకి దింప‌గా, వైసీపీ శిల్పా మోహ‌న్ రెడ్డికి టికెట్ ఖ‌రారు చేసింది. ఇప్ప‌టికే ఇద్ద‌రు అభ్య‌ర్థులు నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాన్ని చుట్టేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందేన‌న్న ఉద్దేశంతో అధికార పార్టీ హోదాలో టీడీపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతుండ‌గా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మదే గెలుపు అని నిరూపించేందుకు వైసీపీ కూడా స‌ర్వ‌స‌న్న‌ద్ధంగానే బ‌రిలోకి దిగేసింది. ఈ క్ర‌మంలో నిన్న వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి, పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీగా ఉన్న మ‌లికిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డితో క‌లిసి కార్య‌క‌ర్త‌ల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శిల్పా ఆసక్తిక‌ర కామెంట్లు చేశారు.

నంద్యాల ప్ర‌జ‌లు త‌మ వెంటే ఉన్నార‌ని, ఉప ఎన్నిక‌లో అధికార టీడీపీ ఎన్ని కుయుక్తులు ప‌న్నినా గెలుపు మాత్రం త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ఆ గెలుపును పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కానుక‌గా ఇద్దామ‌ని ఆయ‌న ఇచ్చిన పిలుపున‌కు కార్య‌క‌ర్త‌ల నుంచి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. నంద్యాల ఉప ఎన్నిక గెలుపే 2019 ఎన్నిక‌ల‌కు మ‌లుపు కావాల‌ని కూడా ఆయ‌న పిలుపునిచ్చారు. 2019లో జ‌గ‌న్‌ను సీఎంగా చూడాల‌నుకుంటే... ఈ ఉప ఎన్నిక‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా విజ‌యం సాధించి తీరాల్సిందేన‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇందుకోసం కార్య‌క‌ర్త‌లు సైనికుల్లా ప‌నిచేయాల‌ని, కార్య‌క‌ర్త‌ల బ‌లంతోనే ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించి తీర‌తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా అధికార పార్టీ కుయుక్తుల‌ను ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు వివ‌రించి చెప్పారు.

ఏనాడూ నంద్యాల అభివృద్దిని ప‌ట్టించుకోని టీడీపీ నేత‌లు... కేవ‌లం ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోస‌మే పెద్ద ఎత్తున నిధులు విడుద‌ల చేస్తున్నార‌ని, ఎన్నిక‌లు వ‌చ్చేలోగానే ప‌నులు పూర్తి చేసి ఓట‌ర్ల‌ను మాయ చేయాల‌ని ప‌న్నాగాలు ప‌న్నుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అస‌లు ఇప్పుడు నంద్యాల అభివృద్దికి టీడీపీ స‌ర్కారు ఇంత పెద్ద ఎత్తున నిధులు విడుద‌ల చేసిందంటేనే... ఆ పార్టీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని ఇట్టే అర్థ‌మ‌వుతోంద‌ని కూడా శిల్పా అన్నారు. ఎన్ని వేల కోట్ల నిధులు ఖ‌ర్చు చేసినా ఉప ఎన్నిక‌లో వైసీపీనే విజ‌యం వ‌రిస్తుంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఇక ఆ త‌ర్వాత జ‌రిగిప పార్టీ చేరిక‌ల్లో నంద్యాల ఆరో వార్డు కౌన్సిలర్‌ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో 300 మంది టీడీపీ కార్యకర్తలు, టీడీపీ సీనియర్‌ నాయకుడు రామచంద్రుడు, ఆయన అనుచరులు 200 మంది శిల్పా సమక్షంలో వైసీపీలో చేరారు.