Begin typing your search above and press return to search.

అందరిని ముంచిన శిల్పా చౌదరిని కోటిన్నర కొంప ముంచిందట

By:  Tupaki Desk   |   1 Dec 2021 7:30 AM GMT
అందరిని ముంచిన శిల్పా చౌదరిని కోటిన్నర కొంప ముంచిందట
X
పెద్ద తోపుగా చెప్పేటోళ్లు చివరకు చిన్నోళ్ల చేతిలో చిత్తుగా ఓడిపోవటం.. తీర్చలేని అవమాన భారాన్ని మిగుల్చుకోవటం కనిపిస్తూ ఉంటుంది. సెలబ్రిటీలు.. ప్రముఖులు.. సొసైటీలో హైక్లాస్ కు చెందినోళ్లను అడ్డదిడ్డంగా ముంచేసిన కిట్టీ పార్టీ ఆంటీ శిల్పా చౌదరి అడ్డంగా బుక్ అయిన తీరు తెలిస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. సినీ.. రాజకీయ.. న్యాయ.. వ్యాపార వర్గాలకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులకు ఖరీదైన పార్టీల పేరుతో వల వేయటం.. తాను చెప్పే సినిమా కబుర్లకు అడ్డంగా బుక్ కావటం.. కోట్లాది రూపాయిలు ఆమెకు సమర్పించుకోవటం తెలిసిందే. ఆమెకు సంబంధించిన భాగోతాలకు సంబంధించిన వివరాల్ని సేకరించే క్రమంలో మరో ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది.

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో కుటుంబాన్ని దాదాపుగా రూ.12 లక్షల వరకు ముంచేసిన ఆమె.. సెలబ్రిటీలు ఎవరైనా సరే.. మూడు కోట్ల రూపాయిల వరకూ వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తంలో దాదాపు రూ.50 కోట్ల వరకు విదేశాలకు హవాలా రూపంలో ఇప్పటికే బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి.. విదేశాలకు చెక్కేసేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్న ఆమె.. అన్ని అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు నెలల్లో హైదరాబాద్ నుంచి జంప్ అయ్యేందుకు వీలుగా ప్లానింగ్ చేసినట్లుగా చెబుతున్నారు.

రియల్ వెంచర్లలో పెట్టిన డబ్బుల్ని క్యాష్ చేసుకునే విషయంలో జరిగిన ఆలస్యం ఆమెను బుక్ చేసిందని చెప్పాలి. దాదాపుగా వంద నుంచి రెండు వందల కోట్ల వరకు వసూలు చేసిన శిల్పా చౌదరిని అడ్డంగా బుక్ చేసింది మాత్రం కోటిన్నర రూపాయిలేనని చెప్పాలి. దివ్యా రెడ్డి అనే మహిళ నుంచి రూ.కోటిన్నర తీసుకుంది. తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా కాలం గడుపుతున్న శిల్పా చౌదరి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమె.. న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించారు. ఆమె మీద ఫిర్యాదు చేశారు.

తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా.. శిల్పా చౌదరి వ్యవహారాలపై సందేహం వచ్చిన పోలీసులు రంగంలోకి దిగటంతో ఆమె భాగోతం మొత్తం బట్టబయలైంది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకోవటం.. ఆమె లీలలు మీడియాలో ప్రముఖంగా రావటంతో.. పలువురు ఆమె చేతుల్లో మోసపోయిన వైనాన్ని గుర్తించి పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఒక బడా నిర్మాత కుమార్తె రూ.3 కోట్ల వరకు మోసపోయినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. పలువురు పలుకుబడి కలిగిన వారు శిల్పా చౌదరికి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినా.. వాటికి సంబంధించి పత్రాలు లేకపోవటం.. తమకు అంత మొత్తం ఇచ్చారన్న వెంటనే.. ఐటీ అధికారులకు సమాధానం చెప్పాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వెనకుడుగు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా శిల్పా చౌదరి లీలలు హైదరాబాద్ మహానగరంలోని పలువురు ప్రముఖుల కుటుంబాలు లబోదిబోమనే పరిస్థితి.