Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎమ్మెల్యేకు ఆంధ్రా ఎమ్మెల్యే సవాల్

By:  Tupaki Desk   |   27 Dec 2020 3:32 AM GMT
తెలంగాణ ఎమ్మెల్యేకు ఆంధ్రా ఎమ్మెల్యే సవాల్
X
ప్రస్తుతం ఏపీలో బస్తీ మే సవాళ్లు, రాజీనామాల సవాళ్ల ట్రెండ్ నడుస్తోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య రకరకాల విషయాలలో నడుస్తున్న ఈ సవాళ్ల పర్వం తాజాగా తెలంగాణకూ పాకింది. ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలం క్షేత్రంలో షాపుల వ్యవహారంలో తెలంగాణలోని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిల మధ్య వివాదం రేగింది. శ్రీశైలం క్షేత్రంలోని షాపు విషయంలో ముస్లింలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, దీని వెనుక వైసీపీ నేతలున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తన అనుచరుడు, వైసీపీ నేత రజాక్‌‌ను శిల్పా చక్రపాణి వెనుకుండి నడిపిస్తున్నారని, తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తొలగించాన్న కోర్టు ఆదేశాలు పట్టించుకోవడం లేదని, శ్రీశైలంలో గొడ్డు మాంసం, మద్యం అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిల్పా చక్రపాణిని కట్టడి చేసి.. శ్రీశైల క్షేత్రాన్ని కాపాడాలని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే రాజాసింగ్ వ్యాఖ్యలపై శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని, శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు రావాలని రాజాసింగ్ కు సవాల్ విసిరారు. తనపై ఆరోపణలు నిరూపించకుంటే రాజాసింగ్ రాజీనామా చేస్తారా అని శిల్పా చక్రపాణి ప్రశ్నించారు. హిందూత్వాన్ని అడ్డంపెట్టుకొని ఏపీలో పాగావేసేందుకు బీజేపీ యత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రజాక్ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, ఆయన పార్టీ కార్యకర్త మాత్రమేనని, అవనసర ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. తనకు హిందూ మతం అంటే ఎంతో గౌరవమని, ఎన్నో దేవాలయాలకు ఆర్థిక సాయం చేశానని చెప్పారు. శిల్పా విసిరిన సవాల్ పై రాజాసింగ్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.