Begin typing your search above and press return to search.

చక్రపాణి రాజీనామా : సర్కారుకు ఇరకాటమే!

By:  Tupaki Desk   |   5 Aug 2017 12:53 PM GMT
చక్రపాణి రాజీనామా : సర్కారుకు ఇరకాటమే!
X
శిల్పా చక్రపాణి రెడ్డి.. తాను ఎమ్మెల్సీగా గెలిచిన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా.. ఎమ్మెల్సీ పదవికి కూడా సరైన ఫార్మాట్ లో చేసిన రాజీనామా ఇప్పుడు అధికార పార్టీకి ఇరకాటంగా మారుతోంది. వారికి గొంతులో పచ్చివెలక్కాయ్ లాగా తయారైంది. ఇంతకూ దాన్ని ఆమోదించాలా? వద్దా? అనే మీమాంసలో అధికార పార్టీ పడినట్లుగా సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆమోదిస్తే ఒక ఇబ్బంది.. ఆమోదించకపోతే మరో ఇబ్బంది అన్నట్లుగా పరిస్థితి తయారైందని వారు మధనపడుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ టిక్కెట్ మీద ఫ్యాను గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు, ఇప్పటిదాకా అధికార తెలుగుదేశం లోకి 21 మంది గెంతేశారు. అయితే వీరిలో ఎవ్వరూ అధికారికంగా తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. వైకాపాకు మాత్రం రాజీనామా చేసి... తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. కొందరు తాము ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా ఇచ్చాం అంటూ ప్రకటించారు. వీరిలో నలుగురు మంత్రి పదవులను కూడా వెలగబెడుతున్నారు. ఇదంతా పచ్చిగా రాజ్యాంగ విరుద్ధమైన, చట్టవ్యతిరేక చర్యలే అయినప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ దీనిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ.. ఫలితం మాత్రం ఉండడం లేదు. స్పీకరుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఏదో నామమాత్రపు విచారణలు జరుగుతున్నాయే తప్ప.. ఆ ఎమ్మెల్యేలను అనర్హుల్ని చేయడం, లేదా, ఒకవేళ వారు రాజీనామాలు చేసి ఉంటే వాటిని ఆమోదించడం అనే చర్య మాత్రం జరగడం లేదు.

ఇలాంటి సమయంలో.. అధికార పార్టీని వదలి.. విపక్ష పార్టీలోకి వెళ్లడం, అందుకోసం అధికార పదవిని కూడా త్యాగం చేయడం అనే అరుదైన పరిణామం జరిగింది. తెదేపాలో సరైన గౌరవం దక్కడం లేదనే కారణం చూపించిన శిల్పా చక్రపాణి రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. అయితే తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఫార్మాట్ రాజీనామాను తమ నేత జగన్ కు అందించారు. అక్కడినుంచి అది శాసనసభ కార్యదర్శికి కూడా చేరింది. అంటే ఇప్పుడు చక్రపాణి రాజీనామాపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాతావరణం ఎలా ఉన్నదంటే.. దానిని ఆమోదించేస్తే.. తాము పాల్పడిన 21 మంది ఫిరాయింపులకు కూడా తెదేపా నైతికంగా జవాబు చెప్పాల్సి వస్తుంది. ఆమోదించకపోతే.. తమను ధిక్కరించి వెళ్లిపోయిన నేతను తాము ఏమీ చేయలేక మిన్నకుండిపోయాం అని పరువు పోతుంది. ఇలాంటి ఇరకాటం పరిస్థితిలో తెదేపా ఉన్నట్లుగా పలువురు అనుకుంటున్నారు.