Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై చక్రపాణి విసుర్లు

By:  Tupaki Desk   |   15 July 2017 12:34 PM IST
చంద్రబాబుపై చక్రపాణి విసుర్లు
X
శిల్పా చక్రపాణిరెడ్డి.. నిన్నమొన్నటి వరకు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు. కానీ... ఆయన సోదరుడు మోహనరెడ్డి వైసీపీలో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో చంద్రబాబు సూచనలతో టీడీపీ నేతలంతా ఆయన్ను పక్కనపెట్టారు. చంద్రబాబు ఆయన స్థానంలో వేరొకరిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అంతేకాదు.. ఈ ఎన్నికల పనుల్లో ఆయన్ను కనీసం వేలు కూడా పెట్టనివ్వడం లేదు. దీంతో అంత సీనియర్ లీడర్ కూడా పార్టీలో ఏకాకిగా మిగిలిపోయారు. సోదరుడు వైసీపీలోకి వెళ్లినా టీడీపీలోనే తాను ఉన్నప్పటికీ కూడా అనుమానంగా చూస్తుండడంతో ఆయన ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ప్రభుత్వ విధానాలపై శిల్పా అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని విమర్శించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంటే విలువ లేకుండా పోయిందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంటే ఉత్సవ విగ్రహాల్లా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తమకు నిధులు లేవు - విధులు లేవని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అయిన ఆయన మండిపడ్డారు.

స్థానిక సంస్థల సమస్యలపై తాను పలుమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. నిధులు లేవు - విధులు లేవంటూ శిల్పాచక్రపాణిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి. శిల్పా చక్రపాణిరెడ్డిని కొంతకాలంగా టీడీపీ దూరంగా ఉంచుతోంది. సోదరుడు శిల్పా వైసీపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో శిల్పా చక్రపాణిరెడ్డిని టీడీపీ అనుమానాస్పదంగానే చూస్తోంది. జిల్లా టీడీపీ నేతలు కూడా ఆయనతో సంబంధాలు నడిపేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో చక్రపాణిరెడ్డి కూడా ఇక టీడీపీలో ఉండడం అనవసరం అన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.