Begin typing your search above and press return to search.

మేధావులు.. శిఖర్ మాటల్ని కాస్త వింటారా?

By:  Tupaki Desk   |   19 Feb 2016 12:39 PM GMT
మేధావులు.. శిఖర్ మాటల్ని కాస్త వింటారా?
X
గ్రౌండ్ లోకి దిగి తన బ్యాట్ తో ప్రత్యర్థి బౌలర్లకు గట్టి గుణపాఠం చెప్పటమే కాదు.. భారత కీర్తి పతాకాన్ని అనునిత్యం ఎగిరేందుకు తీవ్రంగా శ్రమించే టీమిండియాసభ్యుల్లో ఒకరు శిఖర్ ధావన్. తన మెరుపు బ్యాటింగ్ తో భారత్ కు ఎన్నో విజయాల్ని అందించిన ఆయన.. తాజాగా దేశాన్ని కుదిపేస్తున్న జేఎన్ యూ వ్యవహారంపై స్పందించారు.

ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ సభను నిర్వహించటం.. ఈ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు.. దేశద్రోహం కేసును నమోదు చేయటం.. అరెస్ట్ చేసి జైలుకు పంపితే.. ఆందోళనలు చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ విషయం మీద మేధావులు అని చెప్పుకునే వాళ్లు చిత్రవిచిత్రమైన వాదనల్ని వినిపిస్తూ.. ఉగ్రవాదుల్ని కీర్తించటం.. వారికి మద్దుతుగా మాట్లాడటం భావస్వేచ్ఛగా.. భావాల సంఘర్షణతో అద్భుతమైన సమాజాన్ని ఆవిష్కరించేందుకు సాయం చేస్తుందన్న చిత్రమైన వాదనల్ని చేస్తున్న వేళ.. శిఖర్ ధావన్ చేసిన వ్యాఖ్యల్ని వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎంత సున్నిత అంశమైనా.. మనం నివసించే దేశంపై మనమే చెడుగా మాట్లాడుకోవటం తగదని.. కేంద్ర యూనివర్సిటీల్లో జాతీయ జెండా ఎగురవేయాలన్న కేంద్ర సర్కారు నిర్ణయం భేషైనదని వ్యాఖ్యానించారు. జాతీయ జెండాను మనం ఎంతగా అభిమానిస్తే.. దేశానికి అంత మంచిదన్నారు. విచిత్రమైన వాదనలు వినిపించే బుద్ధ జీవులు ఇలాంటి వ్యాఖ్యలకు ఎలా రియాక్ట్ అవుతారో..?