Begin typing your search above and press return to search.

అయోధ్య రాముడికి ముస్లింలు వెండి బాణాలిస్తార‌ట‌

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:09 AM GMT
అయోధ్య రాముడికి ముస్లింలు వెండి బాణాలిస్తార‌ట‌
X
అయోధ్యలో వంద మీటర్ల ఎత్తయిన రాముడి విగ్రహాన్ని నెలకొల్పేందుకు ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం సమాయత్తమవుతోందనే వార్త అన్ని వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిని సృష్టించిన సంగ‌తి తెలిసిందే. సరయూ నదీ తీరాన అతి పెద్ద రాముడి విగ్రహాన్ని నెలకొల్పేందుకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజ్‌ భవన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న‌కు మ‌రో సంచ‌ల‌న అభిప్రాయం తోడ‌యింది. అయోధ్యలో 100 మీటర్ల ఎత్తైన రాముని విగ్రహాన్ని నిర్మించడం భారతీయులందరికీ గర్వకారణమని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌ బోర్డు పేర్కొంది. రామవిగ్రహానికి 10 వెండి బాణాలను భక్తితో సమర్పించుకుంటామని తెలిపింది.

రాముని విగ్రహాన్ని నిర్మించాలని యూపీ సర్కార్ నిర్ణయించడం ప్రశంసనీయమని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కు బోర్డు చైర్మన్ వసీమ్ రిజ్వీ రాసిన లేఖలో తెలిపారు. గంగా-జమునా తెహజీబ్‌ కు అనుగుణంగా - రాముని మీద షియాలకు గల భక్తికి గుర్తుగా వెండి బాణాలను సమర్పిస్తామని రిజ్వీ వివరించారు. రిజ్వీ యూపీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ ప్రాంత నవాబులు అయో ధ్య ఆలయాలను ఎప్పుడూ గౌరవించారు. అయోధ్య నడిబొడ్డులోని హనుమాన్ గఢీ ఆలయానికి 1739లో నవాబ్ షుజావుద్దౌలా భూమి దానమిచ్చారు. 1775-1793 మధ్యకాలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను నవాబ్ ఆసిఫుద్దౌలా సమకూర్చారు అని రిజ్వీ తనలేఖలో గుర్తుచేశారు. మ‌రోవైపు యూపీ సర్కార్ చేపట్టిన రాముని విగ్రహ నిర్మాణాన్ని అఖిలభారత ముస్లిం పర్సనల్ లాబోర్డు విమర్శించిన నేపథ్యంలో రిజ్వీ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. లౌకికదేశంలో ప్రభుత్వాలు దేవతా విగ్రహాల స్థాపనను చేపట్టడం సరికాదని పర్సనల్ లాబోర్డు చైర్మన్ జఫర్యాబ్ జిలానీ - ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు!

సరయు నది తీరాన అయోధ్యలో భారీ శ్రీరాముని విగ్రహం ఏర్పాటు చేయాలని యూపీలోని యోగి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. వివాదాస్పద రామ జన్మభూమికి సమీపంలోనే ఈ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. నవ్య అయోధ్య ప్రాజెక్ట్‌ లో భాగంగా ఏర్పాటు చేయనున్న ఈ విగ్రహానికి వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్‌ లో భాగంగా ఈ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారు. వంద మీటర్ల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. అయితే దీనికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్‌ కు పంపించారు. టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అవస్థీ ఈ సందర్భంగా గవర్నర్‌ కు విగ్రహ ఏర్పాటుపై వివరించారు. ఇక దీపావళికి సరయు తీరాన దివాళీ హారతి ఏర్పాటు చేశారు. ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరయు తీరాన రాముని విగ్రహంతోపాటు రాముని కథను వివరించే గ్యాలరీ - ఆడిటోరియం - ఇతర వసతులను కూడా నవ్య అయోధ్య ప్రాజెక్ట్‌ లో భాగంగా చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.195 కోట్ల డీపీఆర్‌ను కేంద్ర టూరిజం శాఖకు పంపించగా.. రూ.133 కోట్లు విడుదలయ్యాయి.