Begin typing your search above and press return to search.

అప్పుల పాక్.. అడుక్కుతింటోంది.. సాయానికీ రావడం లేదు

By:  Tupaki Desk   |   16 Sep 2022 10:30 AM GMT
అప్పుల పాక్.. అడుక్కుతింటోంది.. సాయానికీ రావడం లేదు
X
ఓ దేశం రెండు ముక్కలైంది.. ఒకటి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని లౌకిక దేశంగా ప్రకటించుకుంది.. మరొకటి మతాన్ని నమ్ముకుని మత రాజ్యంగా ఏర్పడింది. మొదటి దేశం ప్రజాస్వామ్యంతో పరిపుష్టం అయింది. రెండో దేశంలో పైకి ప్రజాస్వామ్యం అంటున్నా.. అక్కడంతా సైనిక రాజ్యమే. ఒక దేశంలో సుస్థిర ప్రభుత్వాలుంటే.. రెండో దేశంలో ఎప్పుడు ప్రభుత్వాలు కూలుతాయో.. తెలియదు. ఆ రెండు దేశాలే భారత్, పాకిస్థాన్. ఆర్థికంగా బలమైన దేశంగా భారత్ ఎదుగుతుంటే.. పాకిస్థాన్ మాత్రం నానాటికీ అప్పుల్లో కూరుకుపోతోంది. ఎప్పుడు ఎవరు సాయం చేస్తారా? అని చూస్తోంది. అలాంటి పాకిస్థాన్ లో ఇటీవల అకస్మాత్తుగా ప్రభుత్వం మారిపోయింది. అంతలోనే వరదలు కమ్ముకొచ్చాయి. ఇంకేం.. ఇప్పటికే పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటిన దేశంలో..ఇతర కష్టాలు పోగయ్యాయి. ఆదుకోమంటూ ఎవరిని అడిగినా పో పో మంటున్నారు. ''కనీసం ఫోన్ చేసినా డబ్బు అడుగుతామని భయపడుతున్నారు. చాలా చిన్న దేశాలు కూడా మనల్ని దాటేసి ముందుకెళ్లాయి. వరదల ముందు కూడా మన దేశం ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదుర్కొంది. వరదలు ఆ పరిస్థితిని మరింత దిగజార్చాయి'' అంటూ సాక్షాత్తు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది.

చిప్ప పట్టుకుని అంటూ..

షెహబాజ్ మాటలను యథాతథంగా చెప్పాలంటే.. పాకిస్థాన్ ఏర్పాటు నుంచి ఆర్థిక కష్టాల్లోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ''75 ఏళ్లుగా చిప్ప పట్టుకుని.. తిరుగుతూ అడుక్కుంటున్నాం. మా కంటే చిన్న దేశాలు కూడా ఆర్థిక రంగంలో మమ్మల్ని దాటిపోయాయి. ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మిత్ర దేశాలు కూడా మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నాయి'' అని ఆయన అనడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు ఏదో మంత్రి స్థాయి వ్యక్తి నుంచి వచ్చినవి అయితే వదిలేయొచ్చు. పాక్ లోని సంపన్న పంజాబ్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి.. మూడుసార్లు దేశ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్ సొంత సోదరుడు, ప్రస్తుత ప్రధాని నుంచి రావడం అంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. తాను మిత్ర దేశాల్లో పర్యటించినప్పుడు డబ్బుల కోసమే వచ్చాననుకుంటున్నారని.. మిత్ర దేశాధినేతలకు ఫోన్‌ చేసినప్పుడు ఇదే పరిస్థితి అని షహబాజ్ వాపోయారు.

వరదలతో పాక్ కల్లోలం..

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌ను భారీ వరదలు పీకల్లోతు కష్టాల్లో పడేశాయి. దీంతో ఆ దేశం ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. ఆదుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చినప్పటికీ.. స్పందన స్వల్పమే. దీంతోనే షహబాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు స్పష్టం అవుతోంది. ''వారంతా మేము భిక్షం అడుగుతామేమో అనే భావనలో ఉన్నారు. నిజంగానే పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. ఇప్పుడు పాకిస్థాన్‌ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది'' అని వాపోయారు.

వాస్తవానికి షహబాజ్ కంటే ముందు ఇమ్రాన్ ఖాన్ ప్రధాని గా ఉన్నప్పుడే పాక్ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షం వహించి ఆయన పదవిని కోల్పోయారు. దీనివెనుక అమెరికా హస్తం ఉందనేలా ఇమ్రాన్ ఆరోపణలు చేశారు. అయితే.. షహబాజ్ వచ్చేసరికి పరిస్థితి మరింత దుర్భరమైంది. మూడు నెలల కిందటి వరదలు పాక్ ను నిండా ముంచేశాయి. 1,500 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు వరదల ప్రభావానికి గురయ్యారు. రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లింది. 78 వేల చదరపు కిలోమీటర్ల మేర పంటలు మునిగిపోయాయి. 3.3కోట్ల మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మూడోవంతు దేశం ఇప్పటికీ నీటిలోనే ఉంది. వరదల కారణంగా 12 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది.

30 వేల కోట్లయినా దొరుకుతాయనుకుంటే..

వైశాల్యం రీత్యా పాకిస్థాన్ మధ్య స్థాయి దేశం. వ్యవసాయికంగా మంచి భూములున్నాయి. పారిశ్రామిక ప్రగతికి అనుకూల వాతావరణం ఉంది. కానీ, పాలకుల తీరుతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. వనరుల సద్వినియోగం కొరవడి దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికితోడు మూడో వంతు కాలం సైనిక పాలనే. వాస్తవానికి సైనిక పాలనలో ఏదంటే అది చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా యంత్రాంగాన్ని శాసిస్తూ ప్రగతికి బాటలు వేయొచ్చు. కానీ, పాకిస్థాన్ లో అలా జరగలేదు. సరికదా.. మరింత అధ్వానంగా మారింది.

ఇక కనీసం రూ. 32 వేల కోట్ల మేర అప్పుదొరుకుతుందేమోనని ఇంటర్నేషనల్‌ మోనిటర్‌ ఫండ్‌(ఐఎంఎఫ్‌) వద్ద ప్రయత్నాలు చేస్తుంటే.. అకాల వర్షాలు, వరదలతో ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్థమైపోయింది''అని ప్రధాని షెహబాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు ఐఎంఎఫ్‌ నిబంధనలను ఉల్లంఘించిన పాపానికి.. ఇప్పుడు ఆ సంస్థ చేపట్టే కొన్ని కార్యక్రమాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. అతికష్టమ్మీద చేసిన ప్రయత్నాలతో ఐఎంఎఫ్‌ రూ. 14 వేల కోట్లను విడుదల చేసిందని, చైనా వంటి మిత్ర దేశాలు మరో రూ. 32 వేల కోట్ల మేర అప్పు ఇచ్చాయని పేర్కొన్నారు. పాక్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు 150 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం చేయాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. అయితే ఇప్పటివరకు కేవలం 38 మిలియన్‌ డాలర్లు మాత్రమే సమకూరినట్లు ఐరాస వెల్లడించింది. అమెరికా, కెనడా, యూకే, జపాన్‌, డెన్మార్క్‌, సింగపూర్‌ సహా పలు దేశాలు పాక్‌కు సాయం ప్రకటించాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.