Begin typing your search above and press return to search.

కళ తప్పిన ఐపీఎల్... రీజనేంటో తెలుసా?

By:  Tupaki Desk   |   19 Sept 2020 11:05 PM IST
కళ తప్పిన ఐపీఎల్... రీజనేంటో తెలుసా?
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మనమంతా పొట్టిగా ఐపీఎల్ అని పిలుచుకునే పొట్టి ఫార్మాట్ క్రికెట్ టోర్నీ శనివారం నుంచే ప్రారంభమైపోయింది. ఐపీఎల్ అంటే... కిర్రెక్కించే చీర్ గాళ్స్ తో పాటు మతి పోగొట్టే ఫిమేల్ కామెంటేటర్లు సర్వ సాధారణమే కదా. అయితే కరోనా పుణ్యమా అని ఈ సారి చీర్ గాల్స్ తరహా ఎంటర్టైన్ మెంట్ లేకపోగా... తాజాగా ఐపీఎల్ ఫ్యాన్స్ కు స్టార్ స్పోర్ట్స్ మరో బ్యాడ్ న్యూస్ వినిపించింది. తనదైన శైలి అందంతో పాటుగా మేటి క్రికెటర్లనే తలదన్నేలా కామెంట్లతో క్రికెట్ లవర్స్ ను ఇట్టే ఆకట్టుకుంటున్న స్పోర్ట్స్ ప్రజెంటర్ మయంతి లాంగర్ ఈ టోర్నీకి దూరంగా ఉండిపోయిందట.

మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ భార్య అయిన మయంతి ఒక్క ఐపీఎల్ లోనే కాకుండా చాలా ఈవెంట్లకు ప్రజెంటర్ గా వ్యవహరించి సదరు టోర్నీలకు ప్రత్యేకమైన కళ తెచ్చిన సంగతి తెలిసిందే. ఫిమేల్ స్పోర్ట్స్ ప్రజెంటర్లు అర్చనా విజయ, షిబానీ దండేకర్ లాంటి వారు ఎందరున్నా... మయంతి లుక్కే వేరని చెప్పక తప్పదు. గ్లామర్ తో పాటు క్రికెట్ లో తలలు పండిన ఆటగాళ్లకు మించిన పరిజ్జానంతో వ్యాఖ్యానం చేసే మయంతి ప్రత్యేకించి ఐపీఎల్ కు ఓ ప్రత్యేకమైన కళనే తెచ్చిందని చెప్పాలి. అయితే కరోనా నేపథ్యంలో ఈ దఫా ఐపీఎల్ దుబాయిలో జరుగుతుండగా... మయంతి మొత్తంగా టోర్నీకే దూరంగా ఉండేందుకు నిర్ణయించుకుంది.

ఇందుకు కారణమేంటంటే... ఇటీవలే మయంతి బిడ్డకు జన్మనిచ్చిందట. ఇటీవలే ప్రసవం జరగడం, చిన్న బిడ్డతో కలిసి దుబాయికి రావడం అంత సేఫ్ కాదని మయంతి భావించిందట. దీంతో తాను ఈ ఐపీఎల్ కు ప్రజెంటర్ గా వ్యవహరించలేనని చెప్పేసిందట. ఇదే విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రకటించేసింది. మొన్నటిదాకా జరిగిన ఐపీఎల్ సీజన్లన్నింటిలో మయంతి తనదైన శైలి ప్రజెంటేషన్ తో క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకోగా.. ఇప్పుడు ప్రసవం నేపథ్యంలో ఆమె టోర్నీకి దూరమైపోయింది. దీంతో మయంతి లేని ఐపీఎల్ కళ తప్పినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.