మునుగోడు గోదాలో షర్మిల....బలమెంతో మరి...?

Mon Aug 15 2022 14:02:48 GMT+0530 (IST)

she wants to show off her power

తెలంగాణాలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయింది. నల్గొండ జిల్లాలో మునుగోడుకు మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగడం ఖాయం. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి మరీ ఎన్నికను తెచ్చారు. ఒక విధంగా ఆధిపత్య పోరుకు అహంకార ధోరణికి ఈ ఉప ఎన్నిక వచ్చిపడింది అని చెప్పాలి. అలాంటి ఉప ఎన్నిక కోసం తెలంగాణాలోని అన్ని పార్టీలు మల్లగుల్లాలు అవుతున్నాయి. అధికార టీయారెస్ అయితే తాము గెలిచి చూపిస్తామని చెబుతోంది. కాంగ్రెస్ తమదే ఆ సీటు అని జబ్బలు చరుస్తోంది.ఇక బీజేపీలో చేరుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ ని చూసుకుని ఈ సీటు మాదే అంటోంది బీజేపీ.ఇక వామపక్షాలు కూడా తామూ అక్కడ బాగానే ఉన్నామని అంటున్నాయి. ఈ పరిస్థితిలో తన తండ్రి వైఎస్సార్ పేరిట పార్టీ పెట్టిన షర్మిల మునుగోడు ఉప ఎన్నికల గోదాలో తన అభ్యర్ధిని నిలబెడుతుందా అన్నదే చర్చగా ఉంది. నిజానికి ఏడాదిన్నర క్రితమే షర్మిల వైఎస్సార్టీపీని పెట్టి తెలంగాణా అంతటా కలియతిరుగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే చాలా మంది నాయకుల కంటే ఆమ జనంలో తిరుగుతున్నాయి. ఆమె పాదయాత్రను కూడా వేల కిలోమీటర్లు చేశారు.

ఆమె కేసీయార్ సర్కార్ ని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణాలో నిరుద్యోగం బాగా ఉందని అంటున్నారు. అలాగే కేసీయార్ సర్కార్ అన్ని విధాలుగా విఫలం అయిందని కూడా ఆమె చెబుతున్నారు. ఎపుడు ఎన్నికలు జరిగినా తామే అధికారంలోకి వస్తామని కూడా అంటున్నారు.

ఎన్నో హామీలు కూడా ఆమె జనాలకు గుప్పిస్తున్నారు. మరి అలాంటి షర్మిల తన పార్టీని మునుగోడు ఉప ఎన్నికల బరిలోకి దింపకపోతే ఏమి బాగుంటుంది అని అంతా అంటున్నారు. ఇక నల్గొండ జిల్లా అంటే వైఎస్సార్ కి చాలా మంది అభిమానులు ఉన్న జిల్లా.

అలాగే షర్మిల పార్టీకి కూడా చెప్పుకోదగిన నాయకులు ఇక్కడ ఉన్నారు. మరి తెలంగాణాలో తన సత్తాను చాటాలనుకున్నా తన పవర్ ఏంటో చూపించాలనుకున్నా షర్మిల పార్టీ పోటీ చేయడమే మంచిది అంటున్నారు. అసలు తెలంగాణాలో షర్మిల పార్టీని మిగిలిన పార్టీల వారు ఏ మాత్రం గుర్తించడంలేదు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల కనుక అడుగు ముందుకేసి తన బలమెంతో మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తెలంగాణా సమాజానికి చాటి  చెబితే ఆ కధే వేరుగా ఉంటుంది అంటున్నారు.

మరో వైపు చూస్తే వైఎస్సార్ టీపీకి ఉన్న బలం ఏంటి జనాలలో ఆ పార్టీ మీద ఉన్న అంచనాలు ఏమిటి అన్నది తెలియాలన్నా కూడా ఆమె ఎన్నికల గోదాలోకి దిగడమే బెటర్ అని అంటున్నారు మరి షర్మిల ఆ దిశగా కీలకమైన నిర్ణయం తీసుకుంటారా. షర్మిల పార్టీ కనుక ఉప ఎన్నిక పోరులో నిలబడితేనే మంచిది అన్న సూచనలు వస్తున్నాయి. లేకపోతే ఏ మాత్రం అంచనాలు లేకుండా 2023 ఎన్నికలకు వెళ్తే ఫలితాలు వేరేగా ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి చూడాలి షర్మిల ఆలోచనలు ఏంటో. ఆమె పార్టీకి మునుగోడులో ఉన్న బలమేంటో.