Begin typing your search above and press return to search.

మొదట కరోనా సోకింది ఈవిడకేనా?

By:  Tupaki Desk   |   28 March 2020 10:30 PM GMT
మొదట కరోనా సోకింది ఈవిడకేనా?
X
కరోనా...చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. గబ్బిలాల వల్ల ఈ పిశాచి వైరస్ ప్రపంచానికి పరిచయమైందని కొందరు....పాంగోలిన్ అనే జంతువు వల్ల ఈ వైరస్ బయటపడిందని మరికొందరు వాదిస్తున్నారు. అయితే, అసలు జంతువుల వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందలేదని మరో వాదన ఉంది. ఇక, వుహాన్ లోని చేపల మార్కెట్ లో ఈ వ్యాధి పురుడు పోసుకుందని ...తొలి కరోనా కేసు కూడా అక్కడ నుంచే నమోదైందని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వుహాన్ లోని రొయ్యలమ్మే ఓ మహిళ దగ్గర నుంచి కరోనా వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తూ లండన్ కు చెందిన ఓ ఆంగ్ల పత్రిక కథనంలో వెల్లడించింది. ఆ మహిళే కరోనా తొలి బాధితురాలు అయి ఉండవచ్చని అభిప్రాయపడింది. 57 ఏళ్ల వయసున్న ఆ మహిళ ద్వారానే ఆ మార్కెట్లో పనిచేసే మరి కొంతమందికి వైరస్ వ్యాప్తి చెందిందని అంచనా వేస్తోంది.

తాను ప్రతి ఏడాది శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటానని, ఈ సారి కూడా అవే లక్షణాలుండడం తో పెద్దగా పట్టించుకోలేదని ఆ మహిళ చెప్పింది. తాను ఆసుపత్రిలో చేరిన తర్వాత మార్కెట్ కు చెందిన మరి కొందరు అవే లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో ఈ వైరస్ గురించి ప్రపంచానికి తెలిసిందని చెప్పింది. ఆ మార్కెట్లోని కామన్ టాయిలెట్ నుంచి తనకు వైరస్ సంక్రమించి ఉంటుందని ఆ మహిళ అనుమానించింది. అయితే, చైనా ప్రభుత్వం ఈ వైరస్ ను మొదట పెద్ద సీరియస్ గా తీసుకోలేదని, అందుకే ఈ రోజు వేలాది మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఈ వైరస్ తొలిసారిగా గుర్తించిన 27 మందిలో ఆ మహిళ కూడా ఒకరని వుహాన్ మునిసిపల్ హెల్త్ కమిషన్ స్పష్టం చేసింది. అయితే, ఆ 27 మందిలో 24 మంది మార్కెట్ తో సంబంధం కలిగిఉన్నారని, ఆ 24 మందిలో ఆ మహిళ కూడా ఉందని చెప్పింది. ఆ మహిళే తొలి కరోనా పాజిటివ్ కేసు అని, అలా అని వైరస్ బారిన పడ్డ తొలి మహిళ ఆమేనని చెప్పలేమని తెలిపింది.