Begin typing your search above and press return to search.

రాష్ట్రపతిభవన్ లో ఆమె... ?

By:  Tupaki Desk   |   27 Jan 2022 11:30 PM GMT
రాష్ట్రపతిభవన్ లో ఆమె... ?
X
ఉత్తరాది రాష్ట్రాలో ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఫలితాలు రావడానికి నలభై రోజుల టైమ్ ఉంది. ఆ తరువాత జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులు మారుతాయి. బలాబలాలు కూడా తేలతాయి. మార్చి 10న అయిదు రాష్ట్రాల ఫలితాలు వచ్చాక బీజేపీ బలం ఎప్పటిలాగానే ఉంటే రాష్ట్రపతి ఎన్నికలలో పెద్దగా హడావుడి ఉండదు, విపక్షాలు వ్యతిరేకించినా బీజేపీ మద్దతు ఇచ్చిన వారే రాష్ట్రపతి భవన్ లోకి వెళ్తారు. అక్కడ ఏమైనా తేడా కొడితే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ఇదంతా ఈ ఎన్నికల ఫలితాల మీదనే ఆధారపడి ఉంటుంది.

వంద దాకా ఎంపీలు, ఆరు వందల దాకా ఎమ్మెల్యేలు ఈ అయిదు రాష్ట్రాలలో ఉన్నారు. వీరంతా రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రోల్ కాలేజ్ మెంబర్స్ గా ఉంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింది పదవీ కాలం జూలైతో పూర్తి అవుతుంది. ఆయన వారసుడు ఎవరు అన్న చర్చ కూడా ఇపుడు జోరుగా సాగుతోంది. బీజేపీ ఎవరిని అభ్యర్ధిగా ప్రకటిస్తుంది అన్నదీ కూడా అసక్తికరమే.

ఎందుకంటే 2017లో చూసుకుంటే బీజేపీ అనూహ్యంగా రామ్ నాధ్ కోవింద్ ని తెరపైకి తీసుకువచ్చింది. ఇపుడు కూడా అలాంటి సన్నివేశమే చూడవచ్చు అంటున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఆమె బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. మోడీ అమిత్ షా, జేడీ నడ్డా తరువాత ఆమె బీజేపీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా ఎదిగారు. 2006లో బీజేపీలో చేరిన నిర్మలా సీతారామన్ అంచెలంచెలుగా ఎదిగి బీజేపీ అగ్ర నేతల మద్దతు సంపాదించుకున్నారు. ఆమె ఇందిరా గాంధీ తరువాత మహిళగా రక్షణ మంత్రిత్వ శాఖను నిర్వహించారు. ఆ శాఖను సమర్ధంగా ఆమె చూశారు అన్న మాట కూడా ఉంది.

ఇంకో వైపు చూస్తే ఆర్ధిక మంత్రిగా నిర్మల గత మూడేళ్ళుగా ఉంటున్నారు. ఆమె విషయంలో మోడీ అమిత్ షా మంచి నమ్మకంగా ఉన్నారు. అందుకే ఆమెను రాష్ట్రపతి భవన్ లోకి పంపించాలని చూస్తున్నారు అని తెలుస్తోంది. 2007లో కాంగ్రెస్ జమానాలోతరఫున ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి అయ్యారు. అంటే ఇప్పటికి పదిహేనేళ్ల క్రితం అన్న మాట. ఇపుడు బీజేపీ కూడా మహిళలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఉందని, వారి ట్రంప్ కార్డ్ నిర్మలా సీతారామన్ అవుతుంది అంటున్నారు.