Begin typing your search above and press return to search.

వైసీపీ పధకాలే తెలియవట... జగన్ సారూ వినిపిస్తోందా...?

By:  Tupaki Desk   |   19 Aug 2022 4:30 PM GMT
వైసీపీ పధకాలే తెలియవట... జగన్ సారూ వినిపిస్తోందా...?
X
మనం ఏపీ జనాలకు ఎంతో చేశాం, ఎన్నో పధకాలు లక్షల రూపాయల లబ్దిని ప్రతీ ఇంటి ముంగిటకు చేర్చామని ముఖ్యమంత్రి జగన్ ఒకటికి పదిసార్లు చెప్పుకుంటారు. మనకు 175 సీట్లు రావాల్సిందే అని పార్టీ సమావేశాలలో గట్టిగా బల్లగుద్దుతారు. అయితే గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ మాత్రం వేరేగా ఉన్నాయని అంటున్నారు. ప్రతీ ఇంటికీ మ్యానిఫేస్టోని పట్టుకుని వెళ్ళి మా పధకాలు ఇవీ మీకు అందుతున్నాయా అని అడగమని ఎమ్మెల్యేలను ఆ పార్టీ పంపిస్తోంది.

అలా గడప గడపకు మన ప్రభుత్వం అంటూ గత కొద్ది నెలలుగా సాగుతున్నా ఈ కార్యక్రమంలో చాలా రకాలుగా ఎమ్మెల్యేలు ప్రశ్నలను జనాల నుంచి ఎదుర్కొన్నారు. అలాగే పధకాలు తమకు అందడం లేదు అన్న వారిని చూశారు. అభివృద్ధి లేదు అన్న విమర్శలను కూడా విన్నారు, కన్నారు. కానీ ఫస్ట్ టైమ్ వైసీపీ పధకాల పేర్లు కూడా తనకు తెలియవ్ అంటూ ఒక ఇంటి గడప వద్ద మహిళ కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పిందంటే మూడున్నరేళ్ళ వైసీపీ పాలనకు ఇది కదా అచ్చమైన రిమార్క్ అని అంతా అంటున్నారు.

ఈ ముచ్చట ఎచ్చట జరిగింది అంటే శ్రీ సత్యసాయి జిల్లాలో చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలో గడప గడప కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ఇంటి వద్ద ఆగి పధకాల గురించి చెబుతున్నపుడు ఈ పధకాలే తమకు తెలియవు అని కిరణ్‌ కుమార్‌ అనే ఆసామి భార్య చిగిచెర్ల సాయికృప ఎమ్మెల్యేకు ముఖాన్నే చెప్పేశారు. తనకు పెళ్ళి అయి ఆరేళ్ళు అయిందని, ఒక్క రేషన్ తప్ప ఏ పధకం కూడా తమకు రాలేదని, ఈ ప్రభుత్వం లో అసలు ఏదీ అందలేదని ఆమె చెప్పడంతో తెల్లబోవడం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వంతు అయింది.

అయితే ఆయన వెంటనే సర్దుకుని మీ అత్తకు ఈ పధకాలు అన్నీ అందుతున్నాయని చెప్పారు. వాలంటీర్లతో మాట్లాడిన తరువాత ఎమ్మెల్యే ఏకంగా 1,70,380 రూపాయల దాకా లబ్ది మీ ఫ్యామిలీకి దక్కిందని కూడా చెప్పారు. అయితే మా అత్త మేము వేరుగా ఉంటున్నామని ఆమె చెప్పేసి ఎమ్మెల్యేని మరింత నిరుత్సాహానికి గురి చేశారు. అయినా మీరు ఇంత డబ్బు అంటున్నారు, ఒక్క పైసా నేను ముట్టలేదు, మాకు ఏ పధకం దక్కలేదు అని ఆ మహిళ చెబుతూంటే తెల్లబోవడం వైసీపీ వారి వంతు అయింది.

ఇది కదా గ్రౌండ్ లెవెల్ లో సీన్. అంటే ఒకే కుటుంబంలో అంతా కలసి ఉండరు, వేరుగా ఉంటారు. అలా ఉన్న వారిలో ఒకరికి ఏ పధకం అందదు, మరొకరికి అందినా వారు మాట్లాడరు, టోటల్ గా చూస్తే పధకాల వల్ల లబ్ది పొందామని చెప్పేవారు తక్కువ. ఆయాసపడి గడప గడపకూ తిరిగిన ఎమ్మెల్యేల మీద ఆవేశపడేవారే ఎక్కువ. మరి దీనిని అంతా జగన్ సారూ వింటున్నారా అని సొంత పార్టీ వారి నుంచే వినిపిస్తున్న మాట. మరి ఇలా గ్రౌండ్ లెవెల్ లో ఉంటే 175 సీట్లు వస్తాయా అంటే ఏమో చూడాలనే మాట వినవస్తోంది.