Begin typing your search above and press return to search.

ఆ సినీ కుటుంబం కూడా రెండు పార్టీల్లో!

By:  Tupaki Desk   |   16 April 2019 11:59 AM GMT
ఆ సినీ కుటుంబం కూడా రెండు పార్టీల్లో!
X
ఒకే కుటుంబంలోని వారు వేర్వేరు పార్టీలకు ఓటు వేయడం వారి వారి స్వతంత్రం అని చెప్పాలి. అది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. పల్లెటూళ్లలోకి వెళ్లినా ఉమ్మడిగా జీవించే అన్నదమ్ములు కూడా వేర్వేరు పార్టీలకు ఓట్లు వేసే సందర్భాలు చాలానే ఉంటాయి.

అయితే ఒకే కుటుంబానికి చెందిన వారు వేర్వురుపార్టీల్లో నేతలుగా చలామణి అయిపోవడం మాత్రం ఒకింత విశేషంగా నిలుస్తూ ఉంటుంది. అలా అంటే దేశం అంతటా చాలా కుటుంబాల నేతలు వేర్వేరు పార్టీల్లో ఉండనే ఉంటారు. సినీ - క్రికెట్ సెలబ్రిటీల కుటుంబీకులు వేర్వేరు పార్టీల్లో ఉండటం మాత్రం ఇప్పుడు విశేషం అవుతోంది.

ఈ మధ్యనే టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబీకులు వేర్వేరు పార్టీల్లోకి వెళ్లడం వార్తల్లో నిలిచింది. జడేజా భార్య బీజేపీలో చేరగా, ఆయన తండ్రి- సోదరి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారితో పట్టింపు లేకుండా జడేజ క్రికెట్ ఆడుకుంటూ ఉన్నాడు.

ఆ సంగతలా ఉంటే.. తాజాగా శత్రుఘ్న సిన్హా భార్య సమాజ్ వాదీ పార్టీలోకి చేరారు! అదేంటి.. ఇటీవలే శత్రుఘ్న కాంగ్రెస్ లో చేరారు కదా, అనుకోవచ్చు. బీజేపీని వీడి శత్రుఘ్న కాంగ్రెస్ పార్టీలోకి చేరగా, సమాజ్ వాదీ పార్టీలోకి చేరి ఆ పార్టీ తరఫున ఎంపీ టికెట్ నే పొందుతోంది ఆయన భార్య పూనమ్ సిన్హా.

లక్నోలో రాజ్ నాథ్ సింగ్ ను ఎదుర్కొనడానికి పూనమ్ సిన్హాను బరిలోకి దించుతోందట సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీతో కలిసి పొత్తుతో బరిలోకి దిగుతున్న ఎస్పీ లక్నో సీటును తమ కోటా లో పొందింది. దీంతో అక్కడ నుంచి పూనమ్ సిన్హాను పోటీ చేయించాలని నిర్ణయించిందట. ఇటా బాలీవుడ్ షాట్ గన్ ఒక పార్టీ తరఫున, ఆయన భార్య మరో పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక లక్నో స్థానంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరినీ పోటీలో పెట్టదని, శత్రుఘ్న భార్య కావడంతో ఆమెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకనుందని తెలుస్తోంది! మొత్తానికి భలే రాజకీయమే!