Begin typing your search above and press return to search.

నన్ను మాత్రం పక్కన పెడ్తారా : శతృ అలక!

By:  Tupaki Desk   |   30 Oct 2015 3:18 AM GMT
నన్ను మాత్రం పక్కన పెడ్తారా : శతృ అలక!
X
ఆయనేమో నిత్యం తమ రాజకీయ ప్రత్యర్థిని ఆకాశానికెత్తేస్తూ, ఆయన పాలన అద్భుతం అని కీర్తిస్తూ, అలాంటి పాలకుడు ప్రజలకు మళ్లీ దొరకడని కితాబులిస్తూ గడిపేస్తుంటారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ సొంత పార్టీ వారు ప్రజాకంటకంగా పాలిస్తున్నారని, వారి వైఫల్యాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని.. ఆ ఇబ్బందులను తమ పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని అంటూ సొంత పార్టీ వారిని నిత్యం ఇరుకున పడేస్తూ చెలరేగిపోతూ ఉంటారు.

శల్యుడిని మించి.. సారథ్యంలోఉంటూ.. వెనక్కు లాగుతుండే వారిని ఎవరు మాత్రం పక్కన పెట్టుకుంటారు? అందుకే నరేంద్రమోడీ బ్యాచ్‌ కూడా భాజపాకు చెందిన సీనియర్‌ నాయకుడు మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు శతృఘ్న సిన్హాను బీహార్‌ ఎన్నికల ప్రచారానికి దూరంగా పెట్టింది. ఆ పాయింటు మీద కూడా ఇప్పుడు ఆ హీరోగారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎక్కడెక్కడినుంచో హిందీ వాళ్లయిన బాలీవుడ్‌ స్టార్స్‌ ను ఇక్కడ ఎన్నికల ప్రచారానికి తీసుకువస్తున్నారు. స్వయంగా బీహారీనైన నన్ను మాత్రం దూరం పెడుతున్నారు. అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇలా దూరం పెట్టాల్సి వచ్చే పరిస్థితి ఆయన స్వయంగా సృష్టించుకున్నదే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్రమాజీ మంత్రి శతృఘ్న సిన్హాను మోడీ గద్దె ఎక్కిన తర్వాత ఒక రకంగా దూరం పెట్టారనేచెప్పాలి. నిజానికి లాల్‌కృష్ణ అద్వానీ వంటి ఉక్కు పిడుగులనే అధికారానికి దూరంగా పెట్టిన మోడీ.. శతృఘ్న వంటి వారిని లెక్క పెడతారని లేదు. కాకపోతే జన్మతః బీహారీ ఈయిన శతృఘ్న.. ఈ ఏడాది కాలంలో పలు సందర్భాల్లో బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పాలనను అనేక రకాలుగా ప్రశంసిస్తూ వచ్చారు. నితీశ్‌ వంటి సుపరిపాలన అందించే సీఎం దేశంలోనే లేరనేంత ఘనంగా పొగుడుతూ వచ్చారు. అసలే నితీశ్‌ అంటే మోడీ అగ్గి మీద గుగ్గిలం అవుతున్న నేపథ్యంలో.. బీహార్‌ ఎన్నికల్లో నితీశ్‌ ప్రాభవాన్నే ఎదుర్కోవాల్సి ఉన్న భాజపా.. ఈ రకం పొగడ్తలను భరించలేకపోయింది.

శతృఘ్న సిన్హాను చాలాకాలంగా పార్టీకి దూరంగానే ఉంచారు. పైగ ఆయన మరింత తిరగబడుతూ ఉన్నదున్నట్లు చెబితే ఉలుకా అని కూడా ప్రశ్నించారు. ఇలాంటి నేతను ఎన్నికల ప్రచారానికి నమ్ముకుంటే.. ప్రత్యర్థికి భజన చేస్తాడేమోనని భయపడ్డారు. తొలుత దూరం పెట్టినా, తర్వాత ఎన్నికల ప్రచార సారధుల్లో ఆయన పేరు కూడా చేర్చారు. కానీ ఆయనకు ప్రచారావకాశం మాత్రం పెద్దగా ఇవ్వలేదు. అందుకే మన హీరో శతృ కినుక వహిస్తున్నారు. హిందీ వాళ్లయిన హేమమాలిని, అక్షయకుమార్‌లను కూడా పిలిపిస్తున్నారు కానీ.. బీహారీ నైన నన్నుమాత్రం పక్కన పెడతారా అంటున్నారు. అయినా తమరికి మైకు ఇస్తే ప్రత్యర్థిని కీర్తిస్తారేమో అనే భయం ఉన్నప్పుడు ఎవరు మాత్రం సాహసిస్తారు సార్‌!!