Begin typing your search above and press return to search.

ఎన్డీయేకు కొత్త పేరు పెట్టేసిన కాంగ్రెస్ మేధావి

By:  Tupaki Desk   |   22 Sept 2020 11:12 PM IST
ఎన్డీయేకు కొత్త పేరు పెట్టేసిన కాంగ్రెస్ మేధావి
X
ప్రజాదరణ పెద్దగా లేకున్నా.. అత్యున్నత స్థానాలకు ఎదగటం కాంగ్రెస్ లో కాస్త ఎక్కువే. అధిష్ఠానానికి.. పార్టీలోని కీలక నేతలకు ఎంత సన్నిహితంగా మెలగలిగితే అంత త్వరగా పదవులు సొంతం చేసుకోవచ్చన్న మాట కాంగ్రెస్ తీరు చూసినప్పుడల్లా కనిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లేని వారు సైతం కేంద్ర మంత్రుల్ని చేసిన ట్రాక్ రికార్డు కాంగ్రెస్ సొంతం.

ప్రజాదరణ లేకున్నా.. ‘విషయం’ ఉన్న నేతగా గుర్తింపు పొందారు శశిథరూర్. తన మేధావితనంతో అందరిని ఆకర్షించే ఆయనలో ఉన్న మరో విలక్షణత.. ప్రధాని మోడీని దూకుడుగా ఒక మాట అనేందుకు తెగ మొహమాట పడిపోతుంటారు. తన భార్య ఆత్మహత్య కేసులో తనను ఇబ్బంది పెట్టని మోడీ సర్కారు మీద ఆయనకు కాస్తంత అభిమానం ఎక్కువన్న ఆరోపణ ఉంది.
అలాంటి ఆయన తాజాగా ఎన్డీయేకు కొత్త పేరు పెట్టి షాకిచ్చారు. ఇటీవల కాలంలో మోడీని కానీ.. ఎన్డీయే కూటమిని కానీ ఇంత భారీగా పంచ్ వేసింది లేదని చెప్పాలి. ఇంతకూ ఆయన చేసిన హాట్ కామెంట్ ఏమంటే.. ఎన్డీయే అంటే.. నో డేటా ఎవేలబుల్ అని మండిపడ్డారు. ఎందుకిలా అంటారా? లాక్ డౌన్ వేళ ఎంత మంది వలస కార్మికులు మరణించారు? మరెంత మంది ఉపాధి కోల్పోయారు? అన్న విషయాల్ని పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ ప్రశ్నించటం.. అందుకు ఎలాంటి రికార్డుల్ని నిర్వహించలేదని మోడీ సర్కారు చెప్పటం తెలిసిందే.

ఈ నేపథ్యాన్ని ప్రస్తావించిన శశిథరూర్ మోడీ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టారు. వలస కార్మికులు.. రైతు ఆత్మహత్యలు.. కోవిడ్ 19.. ఆర్థిక వ్యవస్థపై డేటా లేదంటూ విరుచుకుపడ్డారు. కేవలం మాటలతో వదలని ఆయన.. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. ఒక కార్టూన్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. మోడీ.. నిర్మలమ్మ.. అమిత్ షాలు.. నో డేటా ఎవైలబుల్ అనే ప్లకార్డులు పట్టుకున్న ఫోటోను పోస్టు చేశారు. తాజా పరిణామాలతో ఇప్పటివరకు మోడీని వేలెత్తి చూపించే విషయంలో శశిథరూర్ మొహమాట పడతారన్న అపవాదును తొలగించుకున్నట్లైంది.